జీవుడి స్వరూపం ఈశ్వరుడికి తాను పరతంత్రుడిని అనే భావంతో వర్తించడం. దీనిని అన్నమాచార్యుల వారు అనేక కీర్తనల్లో సెలవిచ్చారు. జీవుల బంధ మోక్షాలను స్వామి లీలగా తెలిపి మనలను నిర్భయంగా నిశ్చింతగా ఉండమని సూచించే కీర్తన ఇది.
ప|| సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||
వివరణ:
నీవు సమస్త విశ్వానికీ అంతరాత్మవి. నేను నీవు తప్ప వేరే దిక్కు లేని వాడిని. అలాంటి నేను సర్వపరాధినయ్యాను. చాలు. ఇంక నీ లీలలు కట్టిపెట్టు.
శరణాగతి అన్నదానికి శ్రీవైష్ణవ సంప్రదాయంలో నిర్వచనం "త్వమేవ ఉపాయభూతో మే భవ ఇతి ప్రార్థనా మతిః శరణాగతిః" - ఈశ్వరుడిని నీవు తప్ప నా మోక్షానికి వేరే ఉపాయం లేదు అని ప్రార్థించే మానసిక స్థితియే శరణాగతి.
చ|| వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటి యపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||
వివరణ:
సృష్ట్యాదిలో ఉదాసీనుడిగా ఉన్న జీవుడికి స్వాతంత్య్రాన్ని ఇచ్చి, అతడికి కోరికలు కల్పించి, వాటి కారణంగా అతనిపై కొన్ని అపరాధాలు వేసావు. వేదోక్తమైన కర్మలు చేస్తూ జీవిస్తే స్వర్గం అనీ, అలా జీవించడం నేర్వకపోతే నరకం అనీ ఒక నెపంతో అతన్ని స్వర్గ నరకాల మధ్య ఇరికించావు. స్వతంత్రం నువ్వే ఇచ్చావు కాబట్టి దోషం నీదా జీవుడిదా?
దీని భావం జీవుడికి స్వామి స్వతంత్రం ఇవ్వలేదు అని. అన్నమయ్య, ఆళ్వారుల సిద్ధాంతం ప్రకారం జీవ స్వాతంత్య్రం లేదు. ఇది వారి అనేక రచనల్లో సుస్పష్టం. జీవుడు తానూ స్వతంత్రుడిని అనే భ్రాంతిలో ఉన్నప్పుడు కర్మబంధాల్లో ఇరుక్కుంటాడు.
చ|| మనసు చూడవలసి మాయలు నీవే కప్పి | జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి | ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||
వివరణ:
భగవద్గీతలో స్వామి ఇలా అన్నారు:
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|
మామేవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరన్తి తే|
నాదైన, త్రిగుణాత్మకమైన నా మాయ ఎవరికైనా దాట లేనిది. దీనిని దాటడానికి నన్ను మాత్రమే ఉపాయంగా భావించిన వారు మాత్రమే దీని నుండి తరిస్తారు. ఇక్కడ మాయ అంటే మిథ్య అని అర్థం కాదు. భగవత్ సంకల్పం.
ఈ మాయలను నీవే కల్పించి, జీవులకు విషయాసక్తిని కలిగించి, నీవు దయతో చూసిన వారికి మోక్షం, ఇంకా దయ చూడని వారికి కర్మబంధాలు, అని గొప్పగా చేసావు. ఇందులో కర్త నేనా నువ్వా? నువ్వే అంటే స్వామియే కర్త అని అర్థం. ఇది అన్నమాచార్యుల "ఎవ్వరు కర్తలు కాదు ఇందిరా నాథుడే కర్త", "కరివరదుడే మొదలు కర్త కాబోలు" అన్న కీర్తనల్లో మరింత వివరంగా చెప్పబడింది.
చ|| వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే | కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె | నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||
చరణం 3:
పోతన భాగవతంలో గజేంద్రుడు "ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందు డిందు, మూలకారణంబెవ్వఁడు"అన్నట్లుగా జీవులందరు స్వామియందే జనన మరణాలని పొందుతున్నారు. అలాంటప్పుడు వీరు నా కన్నవాళ్ళు, వారు నా పిల్లలు అనే భ్రమని, అనుంబంధాన్ని, నువ్వే కల్పించి మమ్మల్ని ఈ భవ బంధాల్లో పడేస్తున్నావు. ఇన్నిట్లో కూడా ఓ వేంకటేశా ! నీవు మమ్మల్ని ఇట్టే ఏలుకొన్నావు. ఎందుకంటే నేనెవరో నీవెవరో నా కంటే నీకే బాగా తెలుసు!
గీతలో స్వామి "అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః" అన్న విషయాన్ని అన్నమయ్య స్వామికి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఇక్కడ అహం అంటే సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి అయిన స్వామి , త్వామ్ అంటే అనాదిగా అనేక బంధాల్లో చిక్కిన జీవుడు అని అర్థం.
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్ వేంకటేశాయ మంగళం|

గానం: శ్రీమతి శ్రావణి గంటి
రాగం: మిశ్ర కానడ
స్వరకర్త: శ్రీమాన్ వేదవ్యాస ఆనంద భట్టర్ గారు
Click below for the audio