Saturday 4 April 2020

Lord Rama the Mahan

పల్లవి:

॥పల్లవి॥ ఎదురా రఘుపతికి నీవిటు రావణా నేఁ
డిదేమి బుద్ధి దలఁచి తిట్లాయె బ్రదుకు

















భగవద్గీతలో శ్రీకృష్ణుడు "అవజానన్తి మాం మూఢా మానుషీమ్ తనుం ఆశ్రితం అన్నాడు" (9.11).
మనుష్య రూపంలో ఉన్న నన్ను మూర్ఖులు తెలుసుకోలేరు అని అర్థం. ఇది రామ కృష్ణ అవతారాలు రెండింటికీ వర్తిస్తుంది.

శ్రీవిష్ణు సహస్రనామంలో అణుర్ బృహత్ కృశస్స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అని వచ్చిన చోట మహాన్ అన్న నామానికి "ఇచ్చా అనభిఘాతః" అని అర్థం. అంటే తిరుగులేని సంకల్పం కలవాడు స్వామి. ఇంక ఆయనకి రావణుడు ఏమి ఎదురవుతాడు? అందుకే అతను మూర్ఖుడు.

శ్రీరామాయణంలో ప్రధానంగా ఇద్దరు మూర్ఖులు. ఒకరు శూర్పణఖ, రెండు రావణుడు.

తనకు శ్రీదేవి (సీత) మాత్రమే కావాలి, అది కూడా తల్లిగా కాకుండా మరోలా అని ఆశించాడు రావణుడు. దీనికి అడ్డువస్తే ఆదిమధ్యాంత రహితుడినే అంతం చేద్దాం అనుకున్నాడు! అయినా జగన్మాత కరుణతో రాముడిని శరణు వేడమని చాలా సార్లు చెప్పింది. అలా చెప్పడం ఆవిడ స్వరూపం అయితే వినకపోవడం ఇతని అహంకారం. అందుకే ఇలా అన్నమయ్య చేతిలో తిట్లు తింటున్నాడు!

అలాగే తనకు భగవంతుడు కావాలి, అమ్మవారు అక్కర్లేదు అనుకున్నది శూర్పణఖ. ఈమె మొదటి మూర్ఖురాలు. ఇద్దరినీ ఆశ్రయించి ఉంటే అవతార ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోక పోయినా అంతకంటే ఎక్కువ ప్రేమనే పంచే వాడు జగత్పతి.


చరణం 1:

॥చ1॥ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనఁగ
విరసమై కూలితివి వెఱ్ఱి రావణా
వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము
శరణనకుండఁగానే సమసెఁగా కులము

ఈ చరణం శ్రీవిష్ణు సహస్ర నామంలో రామో విరామో అన్నచోట విరామః అన్న  నామానికి వివరణ. బ్రహ్మాదులు రావణుడికి ఇచ్చిన వరాలని విరమింప చేసిన వాడు రాముడు.

అన్నమాచార్యుల వారు "విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు" కీర్తనలో చెప్పినట్టు హరునిలోని సంహార శక్తి శ్రీహరిదే. బ్రహ్మ యొక్క సృష్టించే శక్తి ఆ పరబ్రహ్మదే. ఇది తెలియక వారిద్దరినీ పూజించాను, వరాల్ని పొందాను అనుకొని వారెవరో పరమాత్మతో సంబంధం లేని వారిగా భావించి  ఆ సర్వేశ్వరుడిని ఎదిరించాడు. చివరకు హరి హర బ్రహ్మాదిభిస్సేవిత (శ్రీహరి చేత కూడా ప్రేమతో సేవించబడేది  - లక్ష్మీ ధ్యాన శ్లోకం) అయిన జగన్మాత  సీత చెప్పినా  వినకుండా ఆయన శరణు పొందకుండానే నీ దానవ సమూహం అంతటితో కూడా అంతరించి పోయావు.


చరణం 2:

॥చ2॥ జపతపములు నమ్మి సర్వేశు విడువఁగా
విపరీత మాయెఁగా వెఱ్ఱిరావణా
వుపమలన గడు తా నున్న జలనిధి నమ్మి
కపులపాలై తివిగా కదనరంగమున

తను చేసే అనుష్ఠానాలు తనని రక్షిస్తాయి అని నమ్మాడు రావణుడు. వేదైశ్చ సర్వైరహం ఏవ వేద్యః (గీత 15. 15) అని చెప్పినట్టుగా వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడు భగవంతుడు. ఆయన్ని తెలుసుకోలేక ఎన్ని చేసినా వృథానే. ఇలాంటి జ్ఞానాన్ని అన్నమాచార్యుల సంప్రదాయంలో "విపరీత జ్ఞానం" అంటారు.

తాను సముద్ర మధ్యంలో ఉండటం వల్ల ఎవరూ రాలేరులే అని నమ్మాడు. చివరికి ఆ క్షీర సాగర మధ్యంలో ఉండే స్వామి అవతరించగా ఆయన సంకల్పంతో యుద్ధంలో కోతుల పాలయ్యాడు!

అంతరార్థం నిండా మునిగిపోయాడు అని! కపులు చాంచల్యానికి సంకేతం.


చరణం 3:

॥చ3॥ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు
వింటఁ బొలిసితివిగా వెఱ్ఱిరావణా
యింటనే శ్రీ వేంకటేశ్వరునిఁ గొలిచి
వెంటనే సుఖియాయె విభీషణుఁడు

మొండిగా సర్వోత్తముడు, జగత్తుకే  అధీశుడు అయిన రాఘవుడి ధనుస్సుకి బలి అయ్యావు.
నీ ఇంటికే చెందిన విభీషణుడు మాత్రం సర్వలోక శరణ్యుడైన శ్రీ వేంకటేశ్వరుడిని కొలిచి సుఖంగా ఉన్నాడు. శ్రీవేంకటేశ్వరుడిని చెప్పడం ఆయన శరణ్యత్వాన్ని సూచిస్తుంది (ఎందుకు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు). ఈ చరణంలో రెండవ భాగం "సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం" అన్న శ్రీరామాయణ శ్లోకాన్ని (యుద్ధ కాండ 17. 17) సూచిస్తుంది.

Click below for an audio link.




No comments:

Post a Comment

Comments are welcome.