Sunday 30 August 2020

Aakati Velala

పల్లవి:

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు

చరణం 1:

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు

చరణం 2:


ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు

చరణం 3:

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

ఉపోద్ఘాతం:

శ్రీ విష్ణు సహస్రనామంలో భీష్ముల వారు "యాని నామాని గౌణాని" అన్నట్లుగా భగవంతుడి నామాలు ఆయన దివ్య కల్యాణ గుణాలను తెలియచేస్తాయి.

పచ్చని ప్రకృతి లాగ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించి తాపాన్ని హరించే వాడు అని హరి శబ్దానికి అర్థం. ఇంకా పాపాలని హరించే వాడు, లోకాలని సృష్టించి సంహరించే వాడూ ఆ శ్రీహరే.



వివరణ:

పల్లవి:


ఆకలి దప్పులతో అల్లాడుతున్నప్పుడు, మనస్సు శరీరం అలసినప్పుడు  ఉపశమనాన్ని  కలిగించేది శ్రీహరి నామమే. భగవంతుడిని తలుచుకోవడం వల్ల ఆయన తప్పక రక్షిస్తాడు అనే ఒక విధమైన ఆశ్వాసన కలుగుతుంది.

ఇక్కడ ఆకటి వేళల అంటే శరీర పోషణకి కావలసిన ఆహారం లేమి దగ్గర నుండి, పరమాత్మ గురించి ఆత్మకి కలిగే విరహ తాపం వరకు అన్ని అవస్థలూ వస్తాయి.

చరణం 1:

అనేక దోషాలు కలిగి ఉన్నపుడు, కులం చెడినపుడు, ఇతరుల చేజిక్కినపుడు హరినామమే దిక్కు. ఇది మరిస్తే వేరే తెరువు లేదు.

ఇక్కడ కులం చెడటం అంటే భాగవత ధర్మాలని మనిషి పోగొట్టుకొనే పరిస్థితులు ఏర్పడటం అని అర్థం. సాటి భాగవతులు కష్టాల్లో పడి మన విశ్వాసం దెబ్బతినే పరిస్థితి అని కూడా చెప్పవచ్చు.

ఇతరుల చేజిక్కడం అంటే మన శత్రువులైన అహంకార మమకారాలకు లోబడటం, శ్రీహరిని కాకుండా అన్యులని ఆశ్రయించి వారు మనల్ని రక్షిస్తారు అని భ్రమించడం, శ్రీహరి కరుణ కోసం ఎదురు చూడకుండా ఆయనని స్వప్రయత్నంతో సాధనలతో చేరవచ్చని నమ్మి మన రక్షణ కొరకు మనపై ఆధార పడటం, ఇవన్నీ వస్తాయి.


చరణం 2:

ఆపదల్లో చిక్కినపుడు, కష్టాల్లో పడ్డప్పుడు, పాప కర్మలు చేసినపుడు, భయం కలిగినపుడు, వీటన్నిటికీ శ్రీహరిని తలచుకోవడమే ఉపశమనం. ఇంక ఎటు తిరిగినా ఎంత తిరిగినా వేరే దిక్కు లేదు.

భాగవతోత్తములకి నిజమైన ఆపద శ్రీహరిని స్మరించలేకపోవడం. ఆయనని సేవించడానికి కలిగే ప్రతిబంధకాలే కష్టాలు. ఆయనకి మన దాస్యానికి అనుగుణంగా లేని పనులే పాపాలు. రక్షిస్తాడా రక్షించడా అనేదే భయం. ఇవన్నీ కూడా ఒక్క సారి ఆయనని తలిస్తే తీరిపోతాయి.


చరణం 3:

బంధించబడ్డప్పుడు, మృత్యువుకు చేరువైనప్పుడు, ఋణ దాతలు కాచుకున్నపుడు, వీటినుంచి వేంకటేశ్వరుడి నామమే రక్షణగా ఉంటుంది. వేంకటేశ అన్న నామానికి మన కష్టాల్ని పటాపంచలు చేసేవాడు అని "అని ఆనతిచ్చె కృష్ణుడర్జునితో" అన్న కీర్తన వివరణలో చెప్పుకున్నాం.

బంధించబడటం అంటే పాప పుణ్యాలు అనే కర్మల చట్రంలో మన అహంకార మమకారాల కారణంగా ఇరుక్కుపోవడం. భాగవతోత్తములకి భగవంతుడి స్మరణలో గడిపేదే నిజమైన జీవితం, మిగిలిన జీవితం అంతా మృతప్రాయమైనది. . ఇంకా మృత్యుభయంలో ఉన్న వాడికి కూడా భగవంతుడి స్మరణ ఉపశమనాన్ని ఇస్తుంది, జననమరణాలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ.

అప్పుల్లో చిక్కుకున్నవాడికైనా, దేవతలకు పితరులకు ఋషులకు ఋణం తీర్చుకోవడానికి  ఏదో చెయ్యాలి అనే భయంలో ఉన్నవాడికైనా భగవంతుడు ఒకడు ఉన్నాడు అనే నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది.

ఇలా కాకుండా భగవంతుడి నుండి అహంకారంతో విముఖుడై మంకు బుద్ధితో ఉన్న వాడికి గతి ఏమీ లేదు.

భగవద్గీతలో స్వామి "మచ్చిత్తస్సర్వ దుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్ త్వం అహంకారాత్ న శ్రోష్యసి వినఙ్క్ష్యసి" అని అన్నట్లుగా ఆయన పైన చిత్తం లగ్నం చేసిన వాడు కేవలం ఆయన అనుగ్రహంతో కష్టాలని అధిగమిస్తాడు. అహంకరించిన వాడు బాగుపడడు. కాబట్టి ఆ ఆనంద నిలయుడే అన్ని వేళలా మనకు అండ అని భావించి నిర్భయంగా నిర్విచారంగా ఉందాం.

Click below for a link to the audio visual by Smt. Sravani Ganti. 









No comments:

Post a Comment

Comments are welcome.