Sunday, 2 February 2020

Lord riding the Sun

*సూర్యప్రభ సంకీర్తనం*

॥పల్లవి॥విపరీతము లివి వినరాదు
వుపమలెల్ల మీవొద్దనె కలిగె
॥చ1॥వువిదవదనచంద్రోదయవేళను
రవియగుసూర్యప్రభ నీవేగగ
యివల నవల మీయిద్దరివలననే
దినమును రాతిరి దెలియగ గలిగె
॥చ2॥అంగనతురుముమహిర్షి శివేళను
రంగగు సూర్యప్రభ నీవేగగ
సంగడి వెలుఁగును సరి జీకటియును
చెంగట మీయందే చెప్పగ గలిగె
॥చ3॥కాంతమోవి చుక్కల నిండువేళ
రంతుల సూర్యప్రభ నీవేగగ
యింతట శ్రీవేంకటేశ్వర మీయందే
కాంతులు గళలును గలయుట గలిగె
-----(తాళ్లపాక అన్నమాచార్య)
-----(రాగము: నాగ గాంధారి,రేకు: 1433-5,సంపుటము: 24-197)

Ragam: kadanakutuhalam(కదనకుతూహలం)
Composed& sung by Smt.Vandana garu
Click here for a link to the audio.


ఉపోద్ఘాతం:
పురుష సూక్తంలో ఈ క్రింది మంత్రం ఉంది.  
హ్రీశ్చ తే లక్ష్మీశ్చపత్న్యౌ అహో రాత్రే  పార్శ్వే 
నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం

పురుషోత్తముడికి హ్రీ మరియు లక్ష్మీ దేవి భార్యలు. దినం రాత్రి రెండు పార్శ్వాలు. నక్షత్రాలు రూపం. అశ్వినీ దేవతలు బాగా తెరుచుకొన్న నోరు. 

ఇందులో చాలా మటుకు ఈ కీర్తనలో వివరించబడింది. 

పల్లవి:
అతిశయించిన మీ మహిమలని వినడానికి మా చెవులు సరిపోవు. అత్యుత్తమమైన ఉపమానాలన్నీ మీ ఇద్దరి విషయంలో మాత్రమే చెప్పబడుతాయి.

ఈ మధ్యనే మనం చూసిన "ఆచార విచారముల నేనెరుగ" కీర్తనలో "వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట
విపరీత విజ్ఞాన విధులేమి నెరఁగ" అనడం గమనించదగ్గది. 

చరణం 1:
అమ్మవారు అనే చంద్రవదన ముఖోదయానికి కావలసిన సూర్యప్రభవు నీవే! సూర్యుడి లాగ చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు. అలాగే జగన్మాత శ్రీహరిపై ఆధారపడి ఉన్న విషయాన్ని ఇది సూచిస్తోంది. మీ ఇద్దరి వలననే పగలు రాతిరి అని చెప్పడం వల్ల స్వామికి అమ్మవారితో నిత్యయోగం చెప్పబడింది. అలా కాదు, ఇద్దరూ వేరు  అనుకున్నవాళ్ళు  శూర్పణఖా ఆమె అన్న వెఱ్ఱి రావణుడూ!

రాత్రి చంద్రుడు వెలగడాన్ని ప్రస్తావించడం  అజ్ఞానంలో ఉన్నవారిపైన కూడా స్వామి కృప ప్రసరిస్తుందనే ధైర్యాన్ని ఇస్తుంది.

చరణం 2:
తురుము అంటే కొప్పు జ్ఞానానికి సంకేతం. అంగన స్వామి వారి అంగన లోకమాత, భగవత్ కృప! అంతర్జాలంలో వెదికితే "మహిర్షిశి" మహా నిశి ఏమో అని ఒకరిద్దరు అన్నారు. లేదా మహర్నిశి కూడా కావచ్చు. నిశి అంటే రాత్రి. భగవంతుడు అనే సూర్యుడి కృప చేతనే జ్ఞానోదయం అవుతుంది అని అంతరార్థం.

శిశిరం అనే అర్థం వచ్చేటట్టు ఎవరైనా పరిష్కరించినా తప్పులేదు.

ఈ విధంగా అహో రాత్రే పార్శ్వే  అన్నది మొదటి రెండు చరణాల్లో చెప్పబడింది. 

చరణం 3:
శ్రీవిష్ణు పురాణంలో  ఆది మధ్యాంత రహిత క్షీర సాగరంలో ఆవిర్భవించినపుడు ఇంద్రుడు ఇలా అంటాడు.

త్వం మాతా సర్వలోకానాం దేవ దేవో హరిః పితా
త్వయైతత్ విష్ణునా చాంబ! జగద్వ్యాప్తం చరాచరం.

నీవు అన్ని లోకాలకూ తల్లివి. దేవదేవుడు శ్రీహరి తండ్రి. ఓ జగదంబా! మీ ఇరువురి చేత ఈ చరాచర జగత్తు వ్యాపించబడి ఉంది.

ఇక్కడ చెప్పినట్టుగా , పైగా పురుషసూక్తంలో నక్షత్రాణి రూపం అని చెప్పినట్టుగా, అమ్మవారి నోటిలో నక్షత్రాలు అన్నీ నిండి ఉన్నాయిట! ఇంకా మోవి, నక్షత్రాలు అన్నీ నిండి ఉన్న మోవి అని చెప్పడం వల్ల వ్యాత్తం (బాగా తెరచిన నోరు) అన్నది కూడా వచ్చేసింది. అశ్వినీ దేవతలు కూడా నక్షత్రాలే కదా!

"యింతట శ్రీవేంకటేశ్వర మీయందే కాంతులు గళలును గలయుట గలిగె" అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు (self -explanatory)





No comments:

Post a Comment

Comments are welcome.