Sunday 11 September 2022

The divine mother the personification of His grace is the sole refuge for all

 ॥పల్లవి॥ శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా

వాసుదేవుఁడా రమణీవశమైయుండఁగను


భగవద్ రామానుజుల వారు అశరణ శరణ్యామ్ అని శరణాగతి గద్యంలో చెప్పినట్టుగా భగవత్కరుణ శ్రీదేవి మాత్రమే జీవులందరికీ దిక్కు. 

శ్రీయతే ఇతి శ్రీ, శ్రయతే ఇతి శ్రీ, అంటే, మనల్ని భగవంతుడికి ఆశ్రయింపచేసేదీ, భగవంతుడిని నిరంతరం ఆశ్రయించి ఉండేదీ, జగన్మాతే. 


శ్రీవాసుదేవ మహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ అని లక్ష్మీ సహస్రనామాల్లో చెప్పినట్టు అమ్మవారు పురుషోత్తముడైన వాసుదేవుడికి కూడా ఈశ్వరి. భగవంతుడు తన కృపకి తానే వశం అయి ఉంటాడు అని అర్థం. ఈ విధంగా అన్నమయ్య కీర్తనల్లో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. 

క్షీరాబ్ధౌ శ్రీర్యథా జాతా పూర్వం భృగు సుతా సతీ అన్నది శ్రీవిష్ణుపురాణం. పూర్వం భృగుమహర్షి కూతురుగా ఆవిర్భవించిన సతి శ్రీదేవి క్షీరాబ్ధి కన్యకగా వచ్చింది అని అర్థం.  

 సత్తా అంటే అర్థవంతమైన ఉనికి అని అర్థం. భగవంతుడి లాగే శుద్ధసత్త్వరూపిణి అయిన లక్ష్మీదేవిని అందుకే శ్రీసతి అంటారు. 

అదే విధంగా  భర్త జీవితానికి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి భార్యని సామాన్య పరిభాషలో  సతి అని పిలుస్తారు. 


॥చ1॥ సీతవద్దనుండ రాముచేఁ గాకాసురునకు

నాతలఁ బ్రాణము నిల్చె నపరాధియైనాను

యేతుల రావణాసురుఁ డిటువంటివాఁడే కాఁడా

కాతరాన నొంటిఁ జిక్కి పిండతుండా లాయెను


కాకాసురుడికి లోకాలన్నిట్లో ఎవరూ శరణు ఇవ్వకపోతే అపుడు సీతాదేవితో కూడిన రాముడినే ఆశ్రయిస్తే రాముడు రక్షించాడు. 

రావణాసురుడు అహంకారంతో సీత తన అధీనం కావాలి, రాముడు వద్దు అనుకున్నాడు. ఏమైందో తెలిసినదే. 

॥చ2॥ కదిసి రుక్మిణి యుండఁగాఁ గృష్ణునిచే రుక్మికి

అదన బ్రదుకు గల్గె నతిద్రోహి యైనాను

యెదుటనే శిశుపాలుఁ డీరీతివాఁడే కాఁడా

తుద సభలో వదరి తునకలై పడెను


రుక్మిణీదేవితో కలిసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్తుండగా అడ్డు వచ్చిన రుక్మిని అమ్మవారు ప్రార్థిస్తే కృష్ణుడు చంపకుండా అతని జుట్టూ గడ్డమూ మీసాలూ ఒకవైపు కోసేసి పరాభివించి వదిలేస్తాడు. 


అదే కృష్ణుడు ఒక్కడూ వెళ్లిన రాజసూయ యాగంలో శిశుపాలుడి నూరవ తప్పుకి అతనిని చంపివేస్తాడు. 


॥చ3॥ సిరితోడ పైనుండఁగ శ్రీనరసింహుచే దైత్య

గురుపుత్రులు నిలిచిరి క్రూరకర్ము లైనాను

పరగ శ్రీవేంకటేశుపగ గాఁడా హిరణ్యుఁడు

గరిమ నదరిపాటుగాఁగాఁ బొలిసెను

శ్రీదేవి నరసింహ స్వామి తొడపై ఉండగా దైత్య గురు పుత్రులు అంటే హిరణ్యకశిపుడి ఇతర కుమారులూ, ప్రహ్లాదుడి గురువు కుమారులూ, మొదలైన వారు కావచ్చు. వాళ్ళు ప్రహ్లాదుడిని ఎంత హింసించిన వారైనా భగవంతుడు వీరందరూ నిజానికి నా పిల్లలే కదా అని దయతో వదిలేసాడు. 


అదే తాను ఆవిర్భవించినపుడు హిరణ్యకశిపుడిని మాత్రం అప్పటికప్పుడే చీల్చి వధించాడు. 


శూర్పణఖ సీత వద్దు రాముడే కావాలి, ఈమె ఏదో మానవస్త్రీ, నాకు ప్రతిబంధకమైనది అనుకున్నట్టుగా, లక్ష్మీదేవి లేని నారాయణుడు రక్షిస్తాడు, ఆయనే కావాలి, ఈవిడ ఎవరో ఒక దేవత మాత్రమే, అని భేద భావంతో వేరుగా తలిచేవారికి ఈ కీర్తన చక్కని బోధ. 

Click below for a link to an audio visual:





No comments:

Post a Comment

Comments are welcome.