Thursday 25 May 2023

Annamacharya's Srungara Keertanas - An analysis


అన్నమాచార్యుల వారి శృంగార కీర్తనలు - ఒక పరిశీలన
-----------------------------------------------------------------------
పురాణేతిహాసాల్లో నేను విన్నంత వరకూ, శ్రీవారికీ, అమ్మవారికీ మధ్య శృంగార పరమైన వర్ణనలు అంటూ లేవు. అన్ని చోట్ల ఉన్నవాడికీ, ఆయన దయకీ (motherly aspect) మధ్య ఎలా వర్ణిస్తారు? వారి సంబంధం నిత్యమైనది తప్పించి మానవపరమైన బంధం లాంటిది కాదు.
అమ్మవారు శ్రీవారిని కౌగిలించుకుంది అని చెప్పడానికి కూడా వాల్మీకి మహర్షి పెద్ద వివరణ ఇస్తాడు (శ్రీరామాయణం అరణ్యకాండ 30.39)
తమ్ దృష్ట్వా శత్రుహన్తారం మహర్షీణాం సుఖావహం
బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే!
రాములవారు 14000 మంది రాక్షసులని సంహరించి మహర్షులకి సంతోషం కలిగించినపుడు అమ్మవారు ఆయనని హర్షంతో కౌగిలించుకుంది.
భాగవత విరోధులని (మన అహంకార మమకారాలు - ప్రతీకాత్మకంగా) ఆయన తొలగించి భాగవతోత్తములైన మహర్షులకి సుఖాన్ని (భగవద్ అనుభవాన్ని) ప్రసాదించినపుడు, విదేహ సంబంధమైన ఆయన కృప ఆయనని కౌగిలించుకుంది - ఇదీ అంతరార్థం. భగవత్ కృప వల్లే దేహ భ్రాంతి పోతుంది. అలాంటి దేహ భ్రాంతి లేని (విదేహ) రాజర్షుల వంశానికి చెందిన సీతని వైదేహి అంటారు.
అన్నమాచార్యుల శృంగార కీర్తనలని నేను చాలా చూసాను. కాస్తో కూస్తో తెలుగూ సంస్కృతం వచ్చి (కొందరికి చాలా బాగా వచ్చు), అటు అద్వైతంతో కానీ, అన్నమాచార్యుల వైష్ణవంతో కానీ పెద్దగా పరిచయం లేని వారు టన్నుల కొద్దీ వ్యాఖ్యానాలు రాసెయ్యడం వల్ల ఆయన శృంగార కీర్తనలు అమ్మవారికీ అయ్యవారికి మధ్యవిగా ప్రచారం పొందాయి.
కానీ ఎక్కువ శాతం నేను చూసిన కీర్తనలు జీవుడికీ, దేవుడికీ మధ్యవి. అయితే, వ్యాఖ్యానాలు రాసినవారిలో అధికశాతం అటు అద్వైతులూ కారు, ఇటు అన్నమయ్య సంప్రదాయస్థులూ కారు. బహుదేవతారాధకులైన కర్మసిద్ధాంతపరులు. అది కూడా ఈ ఆధునిక కాలంలో వారికి నచ్చిన పూజలూ, పునస్కారాలూ చేసుకునేవారు, ఒక పద్ధతిగా ఇంతకు ముందులాగ సంధ్యావందనం, అగ్నిహోత్రం వంటివి కాకుండా. అందువల్ల ఈ విషయం ఎక్కువ బయటకు రాలేదు.



శృంగారాన్ని శృంగారంగా చూడండి అని నాకు చెప్పిన వాళ్ళు, చెప్పే వాళ్ళు ఉన్నారు.
ముందు కవిత్వాన్ని కవిత్వంగా చూడండి అని వారికి నా సలహా. కవిత్వంలో ఏదీ డైరెక్టుగా చెప్పబడదు. దేవుడు తప్పక అనుగ్రహించును, అతనిని నమ్ముడి, అంటే అది కవిత్వం కాదు. ఏదో ప్రార్థన అవుతుంది!
అన్నమాచార్యుల సిద్ధాంతంలో ప్రతీకాత్మకంగా అందరూ స్త్రీ ప్రాయులే. భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఇది ఏ మాత్రం అసహజమైనది కాదు, జీవుడికి కాళ్ళూ కళ్ళూ లేవు. భగవంతుడు సమస్త ప్రపంచమూ నిండి ఉంటాడు. కాబట్టి తప్పుగా ఊహించడానికి ఏమీ లేదు! బ్రహ్మానందానికి ఒక మానవపరమైన పోలిక మాత్రమే.
జీవుడికి ఈశ్వరుడికి మధ్య సంబంధాన్ని చెప్పే అన్నమయ్య so called శృంగార కీర్తనల్లో consistency, pattern ఉంటాయి. వీటిని నేను అప్పుడప్పుడు పెట్టిన పోస్టుల నుంచి కూడా చూడవచ్చు.
బహుశా కాళిదాసు కుమారసంభవం వ్రాసినప్పటి నుండీ, ఆయనని అందరూ మహాకవిగా గౌరవించడం వల్ల, ఆయా సంప్రదాయాల్లోని దేవుడికీ అమ్మవారికీ మధ్య శృంగార పరమైన సాహిత్యం అందరూ మొదలు పెట్టారు. దీనికి కొన్ని కీర్తనల్లో అన్నమాచార్యులు కూడా మినహాయింపు కాదు.
భగవంతుడికి అమ్మవారికీ మధ్య వర్ణన చేసినప్పుడు అన్నమాచార్యులు అమ్మవారి పేరు నేరుగా ప్రస్తావిస్తారు. అలాగే జీవుడి విషయంలో చెప్పినట్టుగా అశక్తత, అజ్ఞానం, అసూయ (ఇంకో స్వామి భార్యని - అంటే మరొక జీవుడిని ఈర్ష్య పడటం), ఇలాంటివి అమ్మవారి పరంగా అన్నమయ్య చెప్పరు. ఇంకా నాయిక వర్ణన గంభీరంగా ఉంటుంది.
భగవంతుడికి అమ్మవారికి మధ్య చాలా శృంగార కీర్తనల్లో కూడా సందేశం ఉంటుంది. వాటిలో సంకేతార్థాలని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కొన్నింటిలో మాత్రం నాకు సందేశం కనిపించలేదు. బహుశా నేను అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు, లేదా, ఆ కీర్తనలు కేవలం వేడుకగా పాడినవి కావచ్చు

No comments:

Post a Comment

Comments are welcome.