ఫాలనేత్రానల....
గానం: గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు
--------------------------------------------------------------------------
పల్లవి:
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా -
ఫాలభాగంలో (నుదుటి పైన) ఉన్న నేత్రం నుండి వచ్చే అగ్ని యొక్క బలమైన మెరుపులతో సమస్త సృష్టితో ఆడుకొనే వాడు.
నరసింహస్వామికి ఫాలనేత్రం అన్నది పురాణాల్లో లేదు. కొన్ని ఆలయాల్లో ఉంది. అన్నమాచార్యుల కాలం నాటికి ఆలయ సంస్కృతి బాగా విస్తరిల్లింది. రుద్రుడి రౌద్రానికి ఆధారం ఆయనకి అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడే. అలాగే నరసింహ స్వామి హిరణ్యకశిపుడిపై రౌద్రం ప్రదర్శించాడు కాబట్టి, ఆయనకి రుద్రుడిలాగా ఫాలనేత్రం ఉంది అని భావించారు.
చరణం 1:
-----------
ప్రళయమారుత ఘోర భస్త్రికా ఫూత్కార లలిత
నిశ్వాస డోలారచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవి గగనచలన
విధినిపుణ నిశ్చల నారసింహా
- ఒక మెత్తటి సంచిలాగా ఉండే కాలనాగు ఫూత్కారం లాంటి నిశ్వాసం ప్రళయకాలం నాటి వాయువు లాగ ఆయన నాసికల నుంచి వదలబడుతూ ఉంది. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రళయకాలంలో ఉయ్యాల ఊగుతున్నట్టుగా ధ్వనిస్తున్నాయి.
భస్త్రిక అంటే సంచి అని అర్థం. దివ్యప్రబంధంలో శేషుడిని పై అరవు అంటారు. ఒక మెత్తటి సంచిలాంటి పడగని విప్పిన పాము అని అర్థం. ఇక్కడ భస్త్రిక అనే సంస్కృత పదాన్ని వాడటం, అన్నమాచార్యుల దివ్యప్రబంధ విషయ జ్ఞానాన్ని సూచిస్తుంది.
పెద్దపెద్ద పర్వతాలు కలిగిన కుండ వంటి గుండ్రంగా ఉన్న భూమీ, కలువలకి మిత్రుడైన చంద్రుడూ, సూర్యుడూ, ఆకాశంలో విహరించే విధానం ఏర్పాటు చేసే నిపుణుడు అయినా, నిశ్చలుడు, నరసింహుడు.
చరణం 2:
-----------
వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత లవదివ్య
పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువనమగ్నీకరణ నవనవప్రియ
గుణార్ణవ నారసింహా
విస్తారంగా ఉన్న పెద్ద మోముతో, క్లిష్టమైన నవ్వుతో (హిరణ్యుడిని భయపెట్టేది, ప్రహ్లాదుడిని రంజింపచేసేది), ఉన్న నరసింహుడు, తన నోటిలోంచి వచ్చే దివ్యమైన లాలాజలం అనే గుణార్ణవంలో, సమస్త జంతుజాలాన్నీ మగ్నం చేసి, వారికి నవనవోన్మేషంగా ప్రీతిని కలిగిస్తూ ఉంటాడు. (ఓ నరసింహా! అని సంబోధనలో కీర్తన ఉంది.)
నిష్ఠ్యూతము అంటే నోటి నుండి వచ్చినది.
చక్కటి నీటిలో స్నానం చెయ్యడం, లేదా మగ్నం కావడం అనేది భగవద్ విషయ అవగాహాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి తిరుప్పావైలో నీరాడుదల్ అని ఆండాళ్ చెప్పినట్లుగా. నరసింహుడు తన లాలాజలం అనే గుణసముద్రంలోనే మనల్ని అందరినీ ముంచివేయగలడు!
చరణం 3:
-----------
దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ
సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ ప్రకట వేంకట నారసింహా
తన కోరలనుండి వెలువడుతున్న దారుణమైన ప్రకాశవంతమైన, ధగద్ధగాయమానమైన, వికృతమైన అగ్ని విస్ఫులింగాలను (sparks) వెదజల్లుతూ ఉండగా, తన క్రీడలో భాగంగా శత్రువులైన దానవుల ఘోరమైన వంశాన్ని భస్మీకరణం చేయడానికి ప్రకటమైన వెంకటాద్రీశుడే ఈ నారసింహుడు.
దానవుల వంశాన్ని భస్మం చెయ్యడం ఏమిటి, ప్రహ్లాదుడు ఉన్నాడు కదా అంటే, దానవులు మన శత్రువులైన అహంకార మమకారాలు, అరిషడ్వర్గాలు. వీటిని సమూలంగా నాశనం చెయ్యడం కోసమే, తిరువేంగడం పైన స్వామి ప్రకటితమై ఉన్నాడు.
ఇక్కడ వేంకట అన్న పదానికి అర్థం చెప్పబడింది. వేం అంటే తమిళంలో వేడిమి, కడంగళ్ అంటే భగవంతుడిని పొందటానికి అవరోధాలు. ఇవన్నీ నిప్పు ముందు దూదిపింజల్లా తేలిపోతాయి కాబట్టి స్వామి యొక్క పర్వతానికి వేంగడం అనే పేరు వచ్చింది. ఇదే సంస్కృతంలో వేంకటమ్ అయ్యింది.
No comments:
Post a Comment
Comments are welcome.