Saturday, 2 April 2022

The term Anjanadri as explained by Annamayya

అన్నమాచార్య కీర్తన: అణురేణు పరిపూర్ణమైన 

రాగం: షణ్ముఖ ప్రియ

స్వరకర్త: శ్రీమాన్ వేద వ్యాస ఆనంద భట్టర్ స్వామి 

పాడిన వారు: శ్రీమతి శ్రావణి గంటి 

కీర్తన వ్యాఖ్యానంతో బాటు వినడం  కోసం ఈ క్రింది ఆడియో  లింక్ క్లిక్ చేయండి:


https://www.youtube.com/watch?v=pT6eikswZg0

పల్లవి:

అణురేణు పరిపూర్ణమైన రూపము

అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము

పరమాత్మ ముండకోపనిషత్తులో చెప్పినట్టుగా సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. పెద్దవి అనుకునే వాటి కన్నా పెద్ద వాడు. 

భగవంతుడి సూక్ష్మ స్వభావాన్ని అంజన వర్ణత్వం అని ఆళ్వార్లు అంటారు. అంటే కాటుక రేణువులవలె సూక్ష్మమైన స్వభావం కలవాడు. 

అందుకే ఆ నల్లనయ్యని అంజన వర్ణుడు అనీ, అంజన మేని వాడు అనీ అంటారు. ఆయన పర్వతరూపిగా పూజించబడే తిరుమలని అంజన వెఱ్పు అంటారు. కాటుక కొండ లేక కాటుక స్వభావం కల సర్వేశ్వరుడు ఆరాధించబడే కొండ అని అర్థం. సర్వలోకాలకీ అంతర్యామి అయిన విశ్వరూపుడు కొన్ని మైళ్ళ పొడవైన కొండగా  ఆళ్వార్ల చేత ప్రస్తుతించబడటం కూడా ఆయన కాటుక వంటి స్వభావం వల్లనే సాధ్యం కదా. అందుకే నేడు తిరుమల శ్రీవారి ఆలయంలోని దేవుడు కొండంత దేవుడిగా కోట్లాది భక్తుల చేత నుతించబడుతున్నాడు. 

గోదాదేవి తండ్రి విష్ణుచిత్తుల వారు తన చందమామ రావే పాశురాల్లో ఇలా అంటారు. 



ఎన్ శిఱుక్కుట్టన్ ఎనక్కు ఓర్ ఇన్నముదు ఎం పిరాన్ 
తన్  శిఱుక్కైగళాల్ కాట్టిక్కాట్టి అళైక్కిన్ఱాన్
అంజనవణ్ణనోడు  ఆడలాడ ఉఱుదియేల్ 
మంజిల్ మఱైయాదే మా మదీ మగిళ్న్దోడివా!

నా చిన్ని పిల్లవాడు, నాకు అమృతం లాంటి తండ్రి, తన చిట్టి చేతులతో ఓ చందమామా! నిన్ను పిలుస్తున్నాడు. అంజనవర్ణుడైన ఈ పిల్లవాడితో ఆడాలని ఉంటే మబ్బుల వెనక దాక్కోకయ్యా! అని యశోదా భావంలో విష్ణుచిత్తులు చందమామని పిలుస్తున్నారు. 

ఇంకా తర్వాతి పాశురంలో విష్ణుచిత్తుల వారు ఇలా అన్నారు. 

శుత్తుం ఒళి వట్టం శూళ్న్దు శోది పరందు ఎంగుం 
ఎత్తనై శెయ్యిలుం ఎన్ మగన్ ముగం నేరొవ్వాయ్
విత్తగన్ వేంగడ వాణన్ ఉన్నై విళిక్కిన్ఱ 
కైత్తలం నోవామే అంబులీ కడిదోడి వా!

చుట్టూ పరచుకొన్న వెన్నెలతో ఎంతో మనోహరంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నా, మా అబ్బాయి ముఖానికి నువ్వు ఎంత చేసినా  సరి రావు.  సర్వకారణభూతుడైన నా చిన్ని వేంకటేశ్వరుడు నిన్ను తన చేతులతో పిలిచి పిలిచి అవి  ఎంత నొప్పి పుట్టాయో చూడు. ఓ చందమామా? త్వరగా రావయ్యా!

ఈ రెండు పాశురాలనీ చూస్తే, సర్వత్రా ఉన్న శ్రీనివాసుడితో పోలిస్తే చంద్రుడు చిన్న అణువు  లాంటి వాడు. స్వామి యశోద చేతుల్లో పసి బిడ్డగా మారి తన కంటే పరిమాణంలో చాలా చిన్నవాడైన చంద్రుడితో ఆడటానికి సిద్ధమయ్యాడు. అంజన వర్ణుడు కదా! 

అణిమాది అష్ట  సిద్ధులు ఉన్నాయి అని పురాణాల్లో అంటారు. ఇందులో అణిమ అంటే చాలా సూక్ష్మరూపంలోకి మారడం. అందుకే అణిమాది సిరులు ఆ అంజనవర్ణుడైన శ్రీకృష్ణుడిగా పూజించబడే అంజనాద్రికి సహజ సిద్ధమైనవి. 

చరణం 1:

వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

వేదాంతం అంటే ఉపనిషత్తులు. వాటిని అధ్యయనం చేసిన వారు శ్రీహరి స్వభావం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ స్వామి దొరకడు. ఎందుకంటే కఠ ముండకోపనిషత్తుల్లో చెప్పినట్టు పరమాత్మ ఎవరిని వరిస్తే వారికే దొరుకుతాడు. 

యోగీంద్రులు అంటే భగవంతుడితో తమ నిత్య సంబంధం, కేవలం ఆయన దయ కారణంగా తెలుసుకొన్నవారు. వారు స్థిరంగా ఆయననే భావిస్తారు. ఎవరిని అంటే స్వామి పుష్కరిణి వద్ద ఉన్న దైవాన్ని!  తమిళంలో కోన్ అంటే స్వామి. ఏరి అంటే మడుగు. అలాగ కోనేరి అనే పదం వచ్చింది. అదే సంస్కృతంలో స్వామి పుష్కరిణిగా మారింది.

చరణం 2: 

పాలజలనిధిలోన (బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము

స్వచ్ఛమైన పాల కడలిలో మెత్తటి శేషుడిపై యోగ నిద్రలో జగద్ రక్షణ చింతనం చేసే రూపం ఈ శేషాచల రూపమే. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు 

యదాదిత్య గతం తేజో 
జగద్ భాసయతేఖిలం 
యచ్చంద్రమపి యచ్చాగ్నౌ 
తత్తేజో విద్ధి మామకం

ఈ విధంగా సూర్యుడిలోని చంద్రుడిలో అగ్నిలోని తేజస్సు శ్రీవారి రూపమే. 

శ్రీవైకుంఠంలో తన నిత్య అనుభవం కోసం వెలసినది ఈ శ్రీవారి రూపమే. వేరే శ్రీవైకుంఠం గురించి తపించక్కర్లేదు. 

వీటన్నిటికీ లోగుట్టు ఈ శేషగిరి రూపమే! సందేహం లేదు. 

చరణం 3: 

ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము

పరబ్రహ్మ మఱ్ఱి ఆకు మీద బాలకృష్ణుడిగా పవళించి బ్రహ్మనీ బ్రహ్మాండాలనీ సృష్టించాడు అని పురాణాలు అంటాయి.  అలాగే సృష్టి జరిగిన ప్రతిసారీ ఒక్కో బ్రహ్మని సృష్టిస్తాడు. చిన్న పిల్లవాడిగా సృష్టించాడు అని చెప్పడంలో  ఈ సృష్టి మొత్తం స్వామికి చిట్టి పాపాయి ఆట వంటిది అని అర్థం ఉంది.   

అలాంటి పరమేశ్వరుడు మమ్మల్ని ఏలడానికి శ్రీవేంకటాద్రి మీద విచ్చేశాడు. "ఈ రూపమై ఉన్నాడు ఈతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీవేంకటేశుడు" అనే అన్నమాచార్య కీర్తనే దీనికి పరమ ప్రమాణం. 

అకిఞ్చన నిధిమ్ సూతిం అపవర్గ త్రివర్గయోః
అంజనాద్రీశ్వర దయాం అభిష్టౌమి నిరంజనామ్ 

అన్నమాచార్యర్ తిరువడిగళే శరణం 
ఆళ్వార్ ఎమ్బెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం

Sunday, 3 October 2021

Allied post - Pothana's praise of the Divine Mother

పోతన భాగవత పద్యాలు - ఒక పరిశీలన

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలఁ బె

ద్దమ్మ సురారులమ్మకడు పాఱడిపుచ్చినయమ్మ దన్ను లో

నమ్మిన వేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వపటుత్వసంపదల్.


పోతన భాగవతం ప్రార్థనా పూర్వకమైన పద్యాల్లో జగన్మాత గురించి ప్రధానంగా రెండు పద్యాలు ఉన్నాయి. ఆ రెండు పద్యాలూ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే దేవిని ఉద్దేశించి రాసినవే అని తెలుస్తుంది.



తల్లులకు కన్నతల్లి. తిరునిన్ఱవూర్ అనే దివ్యదేశంలో లక్ష్మీ అమ్మవారి పేరు "నన్ను కన్న తల్లి"

భాగవతం ప్రకారం అయ్యవారు శ్రీమన్నారాయణుడు త్రిమూర్తులలకూ మూలమైన వాడు. అంటే బ్రహ్మకూ శివుడికి మూలం అయిన వాడు, తనకు తానే మూలం అయిన వాడు, అని అర్థం. తనకు తానే మూలం ఎలాగ అంటే, తన గురించి తెలుసుకోవడం మనకి తనవల్లే సాధ్యం కదా.
అలా అమ్మవారు లక్ష్మీ దేవి కూడా, మిగిలిన ఇద్దరు అమ్మలకీ అంటే సరస్వతికీ పార్వతికీ మూలం అయినది, తనకు తానే మూలం అయినది.
అందుకే ఆవిడ చాలా పెద్దమ్మ. రాక్షసులైన హిరణ్య కశిపు, మధువు, కైటభుడు, రావణుడు మొదలైన వారిని ఆవిడే స్వామిద్వారా సంహరింపచేసింది. అలాంటి అమ్మే మన విరోధులనుండి మనల్ని స్వామి ద్వారా రక్షిస్తుంది. దైత్యులు అరిషడ్ వర్గాలు.
తనని నమ్మిన సమస్త దేవతల మనసులోనూ ఉండి వారు మాయలో పడకుండా రక్షిస్తుంది. క్షేమానికి కారణం అవుతుంది. అలాంటి కరుణాసముద్ర దుర్గ మన మనసులో సద్బుద్ధి కలుగ చేసి భగవంతుడిని స్తుతించగలగడం అనే కలిమిని ఇచ్చుగాక!
ఇక్కడ దుర్గ అంటే "నవదుర్గామ్" అని అష్టోత్తరంలో అన్నట్టు హరికి పట్టపు రాణి అయిన మహాలక్ష్మి. భారతీ గిరిసుతలని చెలికత్తెలుగా కలిగినది.
అపుడే తర్వాతి పద్యంతో చక్కగా సమన్వయము అవుతుంది.
మాతః సమస్త జగతాం మధుకైటభారేః వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రియదాన శీలే శ్రీవేంకటేశ దయితే తవ సుప్రభాతం.
మహామాయని కూడా దుర్గ అంటారు కదా, ఇక్కడ భగవంతుడికి సోదరిగా ఆవిర్భవించిన మహామాయ గురించి పోతన గారు చెప్పట్లేదా అనే సందేహం ఎవరికైనా కలగవచ్చు. అలా అయితే తర్వాతి పద్యంతో సమన్వయం కలగదు. ఒకసారి ఆ పద్యాన్ని చూద్దాం.


హరికిం బట్టపుదేవి పున్నెములప్రోవర్థంపుఁబెన్నిక్క చం
దురుతోఁబుట్టువు భారతీగిరిసుతల్ దోనాడు పూఁబోడి దా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపుతల్లి సిరియిచ్చున్ నిత్యకల్యాణముల్.

ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ అలమేలు మంగమ్మ శ్రీహరికి పట్టపురాణి. పుణ్యాల రాశి. భగవంతుడిని తెలియజెప్పే గొప్ప అర్థం. క్షీర సాగర పుత్రికగా ఆవిర్భవించినపుడు చంద్రుడిని సోదరిగా కలిగినది. సరస్వతీ పార్వతులతో విలాసంగా ఆడుకొనేది. భగవంతుడి హృత్పద్మంలో అలాగే నేత్ర కమలాలలో చరణ కమలాలలో ఉండే ముగ్ధ. జగత్తులన్నీ గౌరవించే త్రైలోక్య కుటుంబిని. గొప్ప ప్రభావంతో మన కొరతలని పోగొట్టే తల్లి. అలాంటి శ్రీదేవి మనకి నిత్యమూ శుభాలని ఇచ్చుగాక!

మొదటి పద్యంలో సంపదని ఇచ్చేదీ, రెండవ పద్యంలో లేమిని పోగొట్టేదీ ఒకరే!

తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైల నాథ దయితే దయానిధే.

Sunday, 19 September 2021

Viswaprakasunaku - A humble attempt to decode a deeply philosophical song

 అన్నమయ్య సంకీర్తన సంఖ్య 155సంపుటం 1

రాగము :హంసనాదం
స్వరకర్త :శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
గానం: శ్రీమతి శ్రావణి గంటి



విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ
శాశ్వతున కూహింప జన్మ మిక నేడ //పల్లవి //













ఈ విశ్వం అంతా శ్రీమన్నారాయణుడి శరీరమే. విశ్వంలో సమస్తానికీ లోపలా బయటా ఆయన వ్యాపించి ఉన్నాడు. అటువంటి విష్ణుదేవుడికి ఏది లోపల బయట? "అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః" అని నారాయణ సూక్తం చెపుతోంది. సర్వత్రా ఉండి శాశ్వతుడైన వాడికి జన్మ ఏమిటి? నిజానికి రాముడిగా కృష్ణుడిగా ఆయన మనకోసం ఆవిర్భవించాడు కానీ ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వచ్చి అవతారం చెయ్యలేదు. ఇది నరసింహస్వామి విషయంలో స్పష్టంగా తెలిసిందే కదా.

సర్వ పరిపూర్ణునకు సంచారమిక నేడ
నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ
వుర్వీధరునకు గాలూద నొకచోటేడ
పార్వతీస్తుత్యునకు భావమికనేడ //విశ్వ //

సర్వత్ర ఉన్నవాడికి ఇంక సంచారం అనేది ఏమిటి? ఆయన ఎక్కడినుండో వచ్చి మనల్ని రక్షించాలి అని అనుకోవక్కర్లేదు. ఆయన లేని ప్రదేశం ఏది? ఆయన ఎక్కడ అనుగ్రహిస్తే అక్కడే మనకు రక్షణ. ఆయనే మోక్షస్వరూపుడు. ఇంక ప్రత్యేకంగా వేరే పరమపదం గురించి చింత ఎందుకు? వికుంఠులు అంటే భగవద్ అనుభవానికి ఏ అడ్డంకీ లేని వారు. అలాంటి వారికి లభించినవాడు కాబట్టి స్వామిని వైకుంఠుడు అన్నారు. శ్రీవిష్ణు సహస్రనామంలో అణుర్ బృహత్ కృశః స్థూలః అని ఉన్న చోట బృహత్ అన్న నామానికి అన్నమయ్య పూర్వాచార్యులైన పరాశర భట్టార్యులు "పరమాత్మ అన్న భావన ముందు పరమపదం కూడా చులకన అయి ఉంటుంది" అని తెలిపారు. ఆళ్వార్లు కానీ అన్నమయ్య కానీ, ఆంజనేయుల వారు కానీ కోరుకున్నది నిరంతరం ఆయనకి దాస్యమే కానీ ఫలానా చోటు కాదు. సమస్త భూమండలాన్నీ ఆయనే ధరిస్తున్నాడు. ఇంక ఫలానా దివ్యక్షేత్రంలో మాత్రమే ఆయన కాలు మోపాడు అని ఎలా అంటాం? అసలు మొత్తం భూమిని ఆయనే మోస్తుంటే, ఇంకా కాలు మోపడానికి ఒక ప్రదేశం మాత్రమే ఎలా దొరుకుతుంది? శ్రీవిష్ణుసహస్ర నామం పూర్వ పీఠికలో అనాది నిధనం విష్ణుం అన్న చోట విష్ణుం అన్నదానికి అదేశోపాధికం అని పరాశర భట్టార్యులు చెప్పారు. స్వామి సర్వత్ర ఉన్నవాడు కాబట్టి ఏ ప్రదేశం పైనా కూడా ఆయన అనుగ్రహం ఆధార పడి లేదు.

కేనోపనిషత్తులో దేవతలందరూ తమ విజయాలకి తామే కారణం అని గర్విస్తూంటే, పార్వతీ దేవి ప్రత్యక్షమై, అగ్నిలోని దహించే శక్తీ, వాయువులోని వహించే శక్తీ, ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ ఇచ్చినవే అని వారికి ప్రబోధిస్తుంది. ఆవిడ ప్రత్యక్షానికి ముందు ఇంద్రుడు పరబ్రహ్మని సమీపించబోతే స్వామి అంతర్ధానం అవుతాడు. ఈ విధంగా సమస్తానికీ కారణంగా పార్వతీ దేవి చేత స్వామి చెప్పబడగా, ఆయన ఉనికి ఎక్కడో ఒక చోట అని ఎలా చెపుతాం? ఆయన గురించి ఎక్కడ అని భావన చెయ్యగలం?
 
నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ
ఆనన సహస్రునకు నవ్వలివ లేడ
మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ
జ్ఞానస్వరూపునకు గానవిన వేడ //విశ్వ //

ఆయన అనాది నిధనుడు, విష్ణువు, కాబట్టి, మొదలు, మధ్య అంటూ ఏమీ ఉండదు. ప్రపంచం అంటా ముఖాలు కలిగిన వాడు కాబట్టి లోపల బయట అంటూ ఏమీ లేదు. ఏ వస్తువుకైనా లోపలా బయటా ఆయనే. తన సంకల్పంతో దేనికైనా అంతర్లీనంగా ఉంటాడు, దేని లోపలనుంచైనా వ్యక్తపరచుకోగలడు. మౌనం అంటే మనన శీలత్వం. భగవంతుడిని నిరంతరం మననం చేసే వారు మౌనులు. అటువంటి వారి హృదయంలో అంతర్యామిగా వారి బుద్ధిని గాయత్రీ మంత్రంలో చెప్పినట్టుగా ప్రేరేపించే అంతర్యామి మనకు ప్రత్యక్షమై మాట్లాడవలసిన పని ఏమి ఉంది? మనం ఆయనని తలవడం ఆయన ప్రేరణ వల్లే! ఆయన జ్ఞాన స్వరూపుడు. సర్వేశ్వరుడి జ్ఞానం అంటే సమస్త వస్తు సాక్షాత్కారం. ఇంక ఆయన ప్రత్యేకంగా వినవలసింది చూడవలసింది ఏమి ఉంది? భగవంతుడు నాకు ప్రత్యక్షం కావాలి, నా మొర వినాలి అని అనుకునే వారికి ఆచరణాత్మకమైన బోధ చేస్తూనే లోతైన జ్ఞానాన్నిఇక్కడ అన్నమయ్య అందిస్తున్నారు.
పరమ యోగీంద్రునకు పరులేడ తానేడ
దురిత దూరునకు సంస్తుతి నిందలేడ
తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ
హరికి నారాయణున కవుగాము లేడ //విశ్వ //

యుజ్ అనే ధాతువును కలిపి ఉంచడం విషయంలో వాడతారు. సమస్త జీవులతో నిత్యం కలిసి ఉండే ఆ యోగీశ్వరుడికి పరులు అంటూ ఎక్కడ ఉంటారు? తననుండి విడిగా ఎవరూ ఉండరు.
ఆయన సమస్త దురితాలకీ దూరమైన వాడు. ఆ విధంగా ఏ దోషం లేని వాడికి స్తుతి ఏది? నింద ఏది? మన స్తుతి నిందలతో ఆయన ఔన్నత్యానికి సంబంధం లేదు.
ఇంక సర్వత్ర ఉన్న ఆ శ్రీవేంకటేశ్వరుడికి ప్రత్యేకంగా ఆలయాల్లో విగ్రహం ఎక్కడ? సమస్త విశ్వం ఆయన శరీరమే కదా!

మరి మన తృప్తి కోసం ఆయనని విగ్రహ రూపంలో అర్చించినపుడు, ఆయన రూప విశేషాలని ఆయన కళ్యాణ గుణాలకి ప్రతీకలుగా తీసుకోవాలి. మనం అర్చించే మూర్తిలో ఆ సర్వాంతర్యామి ఉన్నాడు అనే పరిపూర్ణ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి.
పుణ్యపాపాల్ని హరించి, సమస్త విశ్వాన్నీ సంహరించే ఆ హరికి, జీవులని అందరినీ వహించే ఆ నారాయణుడికి, ఏదైనా అవడం కాకపోవడం ఎక్కడ ఉంటుంది? సంభవించే సర్వమూ ఆయన సంకల్పమే. అది ఎపుడూ అప్రతిహతమైనది.


Thursday, 24 December 2020

You are My everything!

శ్రీవిష్ణు సహస్ర నామం పూర్వ పీఠిక వ్యాఖ్యానంలో అన్నమాచార్యుల పూర్వాచార్యులైన పరాశర భట్టార్యులు ధ్యానం అన్న పదానికి భగవద్ గుణ అనుచిన్తనం అని నిర్వచనం ఇచ్చారు. భగవంతుడి గుణగణాలని స్మరించడాన్ని మించిన ధ్యానం లేదు. దీనికి సుమధురమైన    కీర్తనల రూపంలో అవకాశాన్నిమనకి ప్రసాదించిన వారు అన్నమాచార్యులు.  

ఈ కీర్తనలో అన్నమయ్య భగవన్నామ కీర్తన ద్వారా భగవద్గుణానుభవం చేస్తున్నారు. 

Click here for an audio visual by Smt. Sravani Ganti.




పల్లవి:

అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ

వివరణ: 

తాపాలనీ పాపాలనీ హరించే శ్రీహరే నాకు సర్వస్వం.

పుండరీకాక్షుడు అంటే తామర పువ్వుల వంటి పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించే వాడు. కాబట్టి, లోకంలో ఎక్కడకు వెళ్లినా ఆయన చూస్తూనే ఉంటాడు. ఇంకా తామర పువ్వుల వంటి పాదాలని జ్ఞానులకు దర్శింపచేసే వాడు అని కూడా అర్థం ఉంది. జ్ఞాని అయిన వాడికి ఎటు చూసినా ఆ త్రివిక్రముడి పాదాలే కనిపిస్తాయి. 

అందరినీ ఆనందింప చేసేవాడు రాముడు. అలాంటి భగవంతుడు ఎపుడూ నా చెంతన ఉన్నాడు. రఘురాముడు అని చెప్పడంలో మన కోసం ఆయన దశరథ కుమారుడిగా రఘుకుల తిలకుడిగా   అవతరించడం ఉంది. 

చరణం 1:


కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ

వివరణ: 

శ్రీవిష్ణు సహస్రనామంలో మహా వరాహో గోవిందః అన్న చోట గోవింద నామానికి అర్థం భూమిని పొందిన వాడు అని అర్థం. ఆ భూదేవికి మగడైన గోవిందుని కులమే భూలోక వాసులైన మన అందరిదీ. అన్నమయ్య ఇంకో కీర్తనలో అన్నట్టుగా ఇందులో జంతుకులం ఇంతా ఒకటే! అంతా ఆ శ్రీహరే కాబట్టి ఆయనే మన కులం. 

కరుణానిధి అయిన ఆ శ్రీనిధే మన పెన్నిధి. 

సమస్తాన్నీ ధరించేది ధరణి. ఆ ధరణిని ధరించే ధరణీధరుడే మన ధారణా శక్తి. ఆయన కృప వల్లనే ఆయనని మనం గుర్తు పెట్టుకోగలం. 

సృష్టికర్త అయిన బ్రహ్మకి తన నాభికమలంలో స్థానాన్ని ఇచ్చిన ఆ పద్మనాభుడే  నా నివాసం. 


చరణం 2:


తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా


వివరణ: 

మన అహంకార మమకారాలని నాశనం చేసి ఇంద్రియాలని నిగ్రహించే వాడు మధుసూదనుడు. కాబట్టి ఆ మధుసూదనుడే నా అర్థవంతమైన మనుగడ. 

మాయతో అందరినీ బంధించే ఈశ్వరుడు యశోదా దేవి చేత తాళ్లతో రోకలికి కట్టి వెయ్యబడ్డాడు. అందువల్ల ఆయనని దామోదరుడు అని పిలుస్తారు. తన సంకల్పంతో  నన్ను ఈ శరీరానికి బద్ధుడిని చేసిన ఆ దామోదరుడే నా శరీరం. దామోదరుడు అంతర్యామిగా ఉన్న ఆత్మని దామోదరుడు అంతర్యామిగా ఉన్న శరీరంతో ఆ దామోదరుడే తన మాయచే కట్టి వేసాడు. ఆహా! ఎంత అద్భుతమో కదా!  

భగవన్నామ శ్రవణమే  నాకు వినికిడి. 

నాకు వెనుక ముందు అన్ని వైపులా ఉన్నది ఆ విశ్వరూపుడైన విష్ణు దేవుడే. 

























చరణం 3:
పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే


వివరణ: 

పురుష సూక్తంలో చెప్పినట్లు సృష్టికంతటికీ మూలమైన ఆ పురుషోత్తముడే నా పుట్టుక. నరులందరికీ అంటే జీవులందరికీ మార్గం అయిన నారాయణుడే నా చిట్ట చివరి గమ్యం. రెండింటి మధ్య అంతా కూడా ఆయనే. భగవద్గీత విభూతి యోగంలో స్వామి "అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ" అన్నదానికి అనువాదమే ఈ చరణంలో మొదటి భాగం. 

ఏ విధంగా అయినా ఓ శ్రీవేంకటేశా! నువ్వే నా గతివి, నాకు వేరే గతి లేదు, లేదు, లేదు.  



Saturday, 3 October 2020

Lord's union with the chosen self

పల్లవి:

కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని

చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు


వివరణ:

శ్రీవిష్ణు సహస్ర నామంలో యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యఙ్ఞాంగో యజ్ఞ వాహనః యజ్ఞ భృత్ యజ్ఞ కృత్ యజ్ఞీ యజ్ఞ భుక్ యజ్ఞ సాధనః అని చెప్పబడినట్టు, భగవంతుడే భగవంతుడే యజ్ఞం, యజ్ఞ కర్త,యజ్ఞ భోక్త, సర్వమూ.  యజ్ఞం అంటే భగవంతుడే అని వేదం యజ్ఞో వై విష్ణుః అని చెపుతుంది. యజ్ఞం చేసేది నాయకుడు, దానికి వేదిక నాయిక (జీవుడు)! యం ఏవైష వృణుతే తేన లభ్యః అని కఠ ముండకోపనిషత్తులలో  చెప్పినట్టుగా ఆయన ఎవరిని వరిస్తే వారికే దొరుకుతాడు. ఇప్పుడు ఈ నాయికకు దొరికాడు. 


చరణం 1: 

సుదతిమోవి తేనెలు సోమపానము నీకు

పొదుపైన తమ్ములము పురోడాశము

మదన పరిభాషలు మంచి వేద మంత్రములు

అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

పువ్వులో తేనె పువ్వు కోసం కాకుండా ఇతరుల కోసం ఉన్నట్టు, నాయిక ఉన్నది నాయకుడి కోసం. 

తాంబూలం భోగ్యత్వానికి ప్రతీక. ఇంక అతిశయించిన మోహంతో  మాట్లాడే మాటలే వేదం మంత్రాలు. 

 

చరణం 2: 

కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము

నలువైన గుబ్బలు కనక పాత్రలు

కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు

చెలగి కామయజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

పయ్యదని తన కృష్ణాజినంగా మన యాజ్ఞీకుడు వేసుకున్నాడు. ఆ పయ్యదలోని  గుబ్బలు శేషత్వాన్ని సూచిస్తాయనీ, శేషత్వం అంటే భగవంతుడికి మాత్రమే చెంది అయన అనుభవం  కోసం మాత్రమే ఉండటం.  ఇంక నాయకుడు చెలగి యజ్ఞం కొనసాగించాడు. 

 

చరణం 3: 

కామిని కాగిలి నీకు ఘనమైన యాగశాల

ఆముకొన్న చెమటలే యవబృథము

యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితి

చేముంచి కామ యజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

యజ్ఞశాల ఏమిటి అంటే చెప్పక్కర్లేదు.  నీల మేఘ వర్ణుడు వర్షించిన చెమటే ఇద్దరికీ అవబృథ స్నానం! ఈ విధంగా శ్రీవేంకటేశుడు నన్ను కూడా ఏలాడు అని ఒక జీవుడు తాదాత్మ్యం చెందటమే ఈ కీర్తన సారాంశం. 


Click below for a link to the nice rendering by Sri Garimella Balakrishna Prasad garu.






Sunday, 30 August 2020

Aakati Velala

పల్లవి:

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు

చరణం 1:

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు

చరణం 2:


ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు

చరణం 3:

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

ఉపోద్ఘాతం:

శ్రీ విష్ణు సహస్రనామంలో భీష్ముల వారు "యాని నామాని గౌణాని" అన్నట్లుగా భగవంతుడి నామాలు ఆయన దివ్య కల్యాణ గుణాలను తెలియచేస్తాయి.

పచ్చని ప్రకృతి లాగ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించి తాపాన్ని హరించే వాడు అని హరి శబ్దానికి అర్థం. ఇంకా పాపాలని హరించే వాడు, లోకాలని సృష్టించి సంహరించే వాడూ ఆ శ్రీహరే.



వివరణ:

పల్లవి:


ఆకలి దప్పులతో అల్లాడుతున్నప్పుడు, మనస్సు శరీరం అలసినప్పుడు  ఉపశమనాన్ని  కలిగించేది శ్రీహరి నామమే. భగవంతుడిని తలుచుకోవడం వల్ల ఆయన తప్పక రక్షిస్తాడు అనే ఒక విధమైన ఆశ్వాసన కలుగుతుంది.

ఇక్కడ ఆకటి వేళల అంటే శరీర పోషణకి కావలసిన ఆహారం లేమి దగ్గర నుండి, పరమాత్మ గురించి ఆత్మకి కలిగే విరహ తాపం వరకు అన్ని అవస్థలూ వస్తాయి.

చరణం 1:

అనేక దోషాలు కలిగి ఉన్నపుడు, కులం చెడినపుడు, ఇతరుల చేజిక్కినపుడు హరినామమే దిక్కు. ఇది మరిస్తే వేరే తెరువు లేదు.

ఇక్కడ కులం చెడటం అంటే భాగవత ధర్మాలని మనిషి పోగొట్టుకొనే పరిస్థితులు ఏర్పడటం అని అర్థం. సాటి భాగవతులు కష్టాల్లో పడి మన విశ్వాసం దెబ్బతినే పరిస్థితి అని కూడా చెప్పవచ్చు.

ఇతరుల చేజిక్కడం అంటే మన శత్రువులైన అహంకార మమకారాలకు లోబడటం, శ్రీహరిని కాకుండా అన్యులని ఆశ్రయించి వారు మనల్ని రక్షిస్తారు అని భ్రమించడం, శ్రీహరి కరుణ కోసం ఎదురు చూడకుండా ఆయనని స్వప్రయత్నంతో సాధనలతో చేరవచ్చని నమ్మి మన రక్షణ కొరకు మనపై ఆధార పడటం, ఇవన్నీ వస్తాయి.


చరణం 2:

ఆపదల్లో చిక్కినపుడు, కష్టాల్లో పడ్డప్పుడు, పాప కర్మలు చేసినపుడు, భయం కలిగినపుడు, వీటన్నిటికీ శ్రీహరిని తలచుకోవడమే ఉపశమనం. ఇంక ఎటు తిరిగినా ఎంత తిరిగినా వేరే దిక్కు లేదు.

భాగవతోత్తములకి నిజమైన ఆపద శ్రీహరిని స్మరించలేకపోవడం. ఆయనని సేవించడానికి కలిగే ప్రతిబంధకాలే కష్టాలు. ఆయనకి మన దాస్యానికి అనుగుణంగా లేని పనులే పాపాలు. రక్షిస్తాడా రక్షించడా అనేదే భయం. ఇవన్నీ కూడా ఒక్క సారి ఆయనని తలిస్తే తీరిపోతాయి.


చరణం 3:

బంధించబడ్డప్పుడు, మృత్యువుకు చేరువైనప్పుడు, ఋణ దాతలు కాచుకున్నపుడు, వీటినుంచి వేంకటేశ్వరుడి నామమే రక్షణగా ఉంటుంది. వేంకటేశ అన్న నామానికి మన కష్టాల్ని పటాపంచలు చేసేవాడు అని "అని ఆనతిచ్చె కృష్ణుడర్జునితో" అన్న కీర్తన వివరణలో చెప్పుకున్నాం.

బంధించబడటం అంటే పాప పుణ్యాలు అనే కర్మల చట్రంలో మన అహంకార మమకారాల కారణంగా ఇరుక్కుపోవడం. భాగవతోత్తములకి భగవంతుడి స్మరణలో గడిపేదే నిజమైన జీవితం, మిగిలిన జీవితం అంతా మృతప్రాయమైనది. . ఇంకా మృత్యుభయంలో ఉన్న వాడికి కూడా భగవంతుడి స్మరణ ఉపశమనాన్ని ఇస్తుంది, జననమరణాలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ.

అప్పుల్లో చిక్కుకున్నవాడికైనా, దేవతలకు పితరులకు ఋషులకు ఋణం తీర్చుకోవడానికి  ఏదో చెయ్యాలి అనే భయంలో ఉన్నవాడికైనా భగవంతుడు ఒకడు ఉన్నాడు అనే నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది.

ఇలా కాకుండా భగవంతుడి నుండి అహంకారంతో విముఖుడై మంకు బుద్ధితో ఉన్న వాడికి గతి ఏమీ లేదు.

భగవద్గీతలో స్వామి "మచ్చిత్తస్సర్వ దుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్ త్వం అహంకారాత్ న శ్రోష్యసి వినఙ్క్ష్యసి" అని అన్నట్లుగా ఆయన పైన చిత్తం లగ్నం చేసిన వాడు కేవలం ఆయన అనుగ్రహంతో కష్టాలని అధిగమిస్తాడు. అహంకరించిన వాడు బాగుపడడు. కాబట్టి ఆ ఆనంద నిలయుడే అన్ని వేళలా మనకు అండ అని భావించి నిర్భయంగా నిర్విచారంగా ఉందాం.

Click below for a link to the audio visual by Smt. Sravani Ganti. 









Sunday, 2 August 2020

A keerthana on Goda Devi

విరహ తాపముచేత విసిగెనిందాకాను
యిరవై మొక్కులు మొక్కీ నిదివోనీదేవుడు--పల్లవి--

చెంపల జెమటగారీ నెలవుల సిగ్గులూరీ
గుంపుగట్టి మూపుమీద గొప్పజారీని
పెంపుడుజిలుకచేత పీటమీదగూచున్నది
ఇంపుతోడ జిత్తగించు ఇదివోనీదేవుడు---విర--

మోమున గళలుమూగీ ముక్కున నిట్టూర్పురేగీ
వేమరు జన్ను లురాన బిఱ్ఱవీగీని
తామెరపువ్వుధరించి దండనె కాచుకున్నది
యేమని మాటాడనయ్య ఇదివో నీదేవుడు---విర--

కాయమెల్లా బులకించీ కాగిలిరతికి బొంచీ
తీయనికెమ్మోవిమీద తేనెలు మించీ
పాయపు శ్రీవేంకటేశ పానుపుపై నిబ్బుగూడె
యీయెడ నలమేల్మంగ ఇదివోనీదేవుడు---విర--
+++++++++++++++++++++++++++++++++
సంపుటి-26 సంకీర్తన 202--రాగం-భైరవి












Pallavi:

virahathApamu chEtha visige nindhAkAnu

iravai mokkulu mokkI nidhivO nI dhEvuDu

CharaNam 1:

Chempala chemaTa kArI nelavula siggulUrI

gumpugaTTi mUpu mIdha goppajArIni

pempuDu chiluka chEtha pITa mIdha kUchunnadhi

imputhODa chitthaginchu idhigOnI dhEvuDu

CharaNam 2:

mOmuna kaLalu mOgI mukkuna niTTUrpu rEgI

vEmaru channulurAna biRRa vIgIni

thAmera puvvu dharinchi dhaNDane kAchukunnadhi

Emani mATADanayya idivO nI dhEvuDu

CharaNam 3:

kAyamellA pulakinchI kAgili rathiki ponchI

tIyani kemmOvi mIdha thEnelu minchI

pAyapu SrIvEnkaTESa! pAnupupai nibbu gUDe

ee yeDa nalamEl manga nidhivO nI dhEvuDu

 

Explanation:

According to annamAchArya and Vedanta dESika, Goddess Andal is Goddess Lakshmi Herself. This can be seen in Sri annamAchArya’s song on Goda Devi “chooDaramma sathulAla SobAna pADaramma” where He says She is Sri Mahalakshmi, mother of Manmatha, mother of the universe, sister of moon (when She incarnated in the milky ocean) and so on.

Sri Vedanta Desika says in his famous Goda Stuti first Sloka “sAkshAt kshamAm karuNayA kamalAm ivAnyAm”  which means “You are Goddess Bhudevi, the very embodiment of His forbearance. You are Goddess kamala or Lakshmi in Your mercy”.

On Tirumala, Goddess Lakshmi is known as alarmEl mangai or the Lady sitting on the lotus flower.

We have the golden icon of Goddess Lakshmi on God’s chest which is taken out during His sacred bath or Thirumanjanam on Fridays. During this period, Andal’s “nAcchiyAr thirumozhi” is chanted which was written by AndAL expressing Her desire to reunite with the Lord and at the same time providing assurance to the human-beings that the Supreme Being is there to take care of them.

The above song is written by Sri AnnamAchArya taking cue from nAcchiyAr Thirumozhi. Here he is addressing a fellow devotee explaining the longing of Andal to unite with Him and subsequent union as She sits with Him for marriage.

In Pandya kingdom, the nAyikA or heroine used to hold a parrot. Examples are Goddess Andal in Vaishnavism and Goddess Meenakshi in Saivism. In this song, the heroine alarmEl mangai holds a parrot and thus denotes Andal. It is worth noting that the Goddess on Lord’s chest (for quite sometime there have been two Goddesses on His chest) is decorated with a parrot during mArgazhi month when Andal’s ThiruppAvai is recited.

Below is the meaning of the same in English.

Pallavi:

She is frustrated out of her pangs of separation so far. She has vowed so many offerings to Him (mokkulu). See here, here is your Lord!

 

Charanam 1:

Sweat is flowing on her cheeks and she is blushing. The flowers are sliding and heaping up on her back. The lady on the lotus, Goddess Lakshmi (Andal) is holding her pet parrot in her hand and has sat on the wedding seat. Look at with affection, here is Your Lord!

Charanam 2:

With expressions on her face and sighs from her nose, and with her breasts tightened, she is sitting next to Him holding a lotus. What to say, here is your Lord!

 Charanam 3:

Thrilled with joy as she is eager to unite with Him, with Her red sweet nectarine lips, Oh Youthful Venkatesa! She joins you on Your divine bed.  My dear friend, see here, here is your Lord!

Note on charaNam 3: Lord reclining on the divine serpent bed symbolizes Jagad rakshaNa chintanam or His devising ways to protect the worlds. The Goddess is, in reality,  inseparable from Him and resides in His heart.

See below for an audio visual by Smt. Jayanthi Sridharan. This audio visual has the nAcchiyAr thirumozhi second Thaniyan where the Goddess is addressed as the parrot herself, and verse 12.9 from nAcchiyAr thirumozhi where she refers to a parrot that repeats the name "gOvindA".