Saturday, 28 December 2019

Lord's grace showering on us

మచ్చికతో నేలవయ్య మదనసామ్రాజ్యలక్ష్మి
పచ్చి సింగారాలచేత బండారాలు నిండెను
॥పల్లవి॥
కొమరెతురుమునను గొప్పమేఘ ముదయించి
చెమటవాన గురిసెఁ జెక్కులవెంట
అమరఁ బులకలపైరు లంతటానుఁ జెలువొంది
ప్రమదాలవలపులపంట లివె పండెను
॥॥
మించులచూపుల తీగెమెఱుఁగు లిట్టె మెరిచి
అంచెఁ గోరికలజళ్లవె పట్టెను
సంచితపుకుచముల జవ్వనరాసులు మించె
పొంచి నవ్వుల మాని పోదిగొనె నిదిగో
॥॥
అలమేలుమంగమోవియమృతము కారుకమ్మి
నలువంక మోహపుసోనలు ముంచెను
యెలిమి శ్రీవేంకటేశ ఇంతి నెట్టె కూడితివి
కొలఁదిమీరి రతులకొటార్లు గూడెను

వివరణ:పల్లవి:

జీవేశ్వరుల సంయోగాన్ని, శ్రీమన్నారాయణుడి కృపనీ, ఈ కీర్తన తెలియచేస్తుంది. ఒకే కీర్తనలో జీవుడిని ఆయన ప్రియురాలిగా, ఆయన పట్టమహిషి జగదీశ్వరిని ఆయన కృపగా తెలపడం ఈ కీర్తన ప్రత్యేకత. 


మచ్చికతో ఏలవయ్య అంటే జీవుడిని అభిముఖుడిని చేసుకొని ఏలుకొమ్మని అర్థం. ఇద్దరూ అభిముఖులైతేనే కదా సంయోగం రక్తి కట్టేది! మద్ అనే ధాతువుని తృప్తి, హర్షం అనే అర్థంలో వాడతారు. కాబట్టి మదన సామ్రాజ్య లక్ష్మి అంటే జీవుడి బ్రహ్మానుభూతి అనే సంపద.

ఇంక "పచ్చి సింగారాల చేత బండారాలు నిండెను" అన్నదానికి అర్థం రెండవ చరణం రెండవ భాగంలో దొరుకుతుంది.

చరణం 1:

కొమెర (జీవుడు - ఈ పాటలో నాయిక) తురుములో అంటే జడలో గొప్ప మేఘం ఉదయించింది.  గొప్ప మేఘం అంటే నీల మేఘ శ్యాముడైన స్వామి. ఆయన దయని అందరిమీదా తారతమ్యం లేకుండా వర్షిస్తాడు కాబట్టి ఈ ఉపమానం చెపుతారు. 
జడలో స్వామి ఉదయించడం ఏమిటి? కేశాలు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానోదయం కాగానే ఆయన దయ వర్షించింది. ఇక్కడ చెమట నాయికదో, స్వామిదో చెప్పలేదు! స్వామిదే అయి ఉంటుంది. ఎలా అని అడక్కండి! అప్పుడే స్వామి దయామృత వర్షి అన్నది ఇక్కడ కుదురుతుంది.  
పులకలు బ్రహ్మానందానుభూతి. 
కృష్ణుడు అంటే భక్తిని కృషి (వ్యవసాయం) చేయువాడు అని అర్థం. అందుకే ఆయన ప్రమదాల వలపు పంట జీవుడిలో పండిస్తాడు!

చరణం 2:
నారాయణ సూక్తం "నీల తోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా" అని అమ్మవారి గురించి చెపుతుంది. పరమాత్మ తన కరుణని వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలమేఘం లాంటి వాడైతే ఆయనని దర్శింపచేసే మెరుపు తీగ జగన్మాత. ఈ ఉపమానం మనం అన్నమాచార్యుల "ఒకపరికొకపరి వయ్యారమై" కీర్తన ఆఖరి చరణంలో కూడా చూడవచ్చు. 
ఒకసారి మెరుపు మెఱయగానే మేఘం కనిపించింది. వర్షం మొదలైంది. ఇక భగవంతుడిని విరహ తాపంతో కోరుకుంటున్న జీవుడి కోరికలన్నీ జడివానలాగ తీరాయి. లేదూ ఆయనే జీవుడిని ఏరి కోరి అనుభవిస్తున్నాడని కూడా చెప్పవచ్చు. 

కుచములు అన్నమాచార్యుల వారి సంప్రదాయంలో శేషత్వం అనే లక్షణాన్ని సూచిస్తాయి. దీని అర్థం ప్రియురాలు ప్రియుడికి మాత్రమే చెందినట్లు జీవుడు భగవంతుడికి మాత్రమే చెందటం. ఇది జడ పదార్థాలకూ అమ్మవారికీ కూడా వర్తిస్తుంది. 

తాను స్వామికే చెందిన వాడిని అనే భావం జీవుడికి అతిశయించగా, పరమాత్మ యథేచ్ఛగా జీవుడిని బ్రహ్మానందంలో ముంచెత్తుతున్నాడు అని అర్థం. 

చరణం 3:
జీవుడిని అనుగ్రహించమని అనుక్షణం స్వామికి చెప్పేది శ్రీదేవి. ఆవిడ పై చరణంలో మెరుపుతో పోల్చబడింది. ఇక్కడ తన అమృతవాక్కులతో స్వామికి చెప్పగానే ఆశ్రితుడిపై ఆయనకి ఉన్న వ్యామోహం అన్ని వైపులా కమ్ముకొంది. ఇక్కడ మేఘం (స్వామి) ఉరుముతో కూడా అమ్మవారి వాక్కుని పోల్చవచ్చు. అమ్మవారు ఇలా స్వామికి చెప్పడాన్ని అన్నమయ్య సంప్రదాయంలో పురుషకారం (recommendation) అంటారు. 

అంతే, వెంటనే స్వామి జీవుడిని చేరుకొన్నాడు, దానితో జీవుడికీ పరమేశ్వరుడికీ శాశ్వతంగా యోగం కూడింది! 



No comments:

Post a Comment

Comments are welcome.