Saturday 3 October 2020

Lord's union with the chosen self

పల్లవి:

కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని

చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు


వివరణ:

శ్రీవిష్ణు సహస్ర నామంలో యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యఙ్ఞాంగో యజ్ఞ వాహనః యజ్ఞ భృత్ యజ్ఞ కృత్ యజ్ఞీ యజ్ఞ భుక్ యజ్ఞ సాధనః అని చెప్పబడినట్టు, భగవంతుడే భగవంతుడే యజ్ఞం, యజ్ఞ కర్త,యజ్ఞ భోక్త, సర్వమూ.  యజ్ఞం అంటే భగవంతుడే అని వేదం యజ్ఞో వై విష్ణుః అని చెపుతుంది. యజ్ఞం చేసేది నాయకుడు, దానికి వేదిక నాయిక (జీవుడు)! యం ఏవైష వృణుతే తేన లభ్యః అని కఠ ముండకోపనిషత్తులలో  చెప్పినట్టుగా ఆయన ఎవరిని వరిస్తే వారికే దొరుకుతాడు. ఇప్పుడు ఈ నాయికకు దొరికాడు. 


చరణం 1: 

సుదతిమోవి తేనెలు సోమపానము నీకు

పొదుపైన తమ్ములము పురోడాశము

మదన పరిభాషలు మంచి వేద మంత్రములు

అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

పువ్వులో తేనె పువ్వు కోసం కాకుండా ఇతరుల కోసం ఉన్నట్టు, నాయిక ఉన్నది నాయకుడి కోసం. 

తాంబూలం భోగ్యత్వానికి ప్రతీక. ఇంక అతిశయించిన మోహంతో  మాట్లాడే మాటలే వేదం మంత్రాలు. 

 

చరణం 2: 

కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము

నలువైన గుబ్బలు కనక పాత్రలు

కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు

చెలగి కామయజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

పయ్యదని తన కృష్ణాజినంగా మన యాజ్ఞీకుడు వేసుకున్నాడు. ఆ పయ్యదలోని  గుబ్బలు శేషత్వాన్ని సూచిస్తాయనీ, శేషత్వం అంటే భగవంతుడికి మాత్రమే చెంది అయన అనుభవం  కోసం మాత్రమే ఉండటం.  ఇంక నాయకుడు చెలగి యజ్ఞం కొనసాగించాడు. 

 

చరణం 3: 

కామిని కాగిలి నీకు ఘనమైన యాగశాల

ఆముకొన్న చెమటలే యవబృథము

యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితి

చేముంచి కామ యజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

యజ్ఞశాల ఏమిటి అంటే చెప్పక్కర్లేదు.  నీల మేఘ వర్ణుడు వర్షించిన చెమటే ఇద్దరికీ అవబృథ స్నానం! ఈ విధంగా శ్రీవేంకటేశుడు నన్ను కూడా ఏలాడు అని ఒక జీవుడు తాదాత్మ్యం చెందటమే ఈ కీర్తన సారాంశం. 


Click below for a link to the nice rendering by Sri Garimella Balakrishna Prasad garu.