Sunday 26 June 2022

Poetic symbolism in Sat Sampradaya Literature

ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే అన్నమాచార్య కీర్తనలకు అర్థం తెలుసుకోవడం చాలా సులభం అని ఈ పోస్టు ఈ బ్లాగులో చేర్చడం అయ్యింది. 


1వ భాగం, ఉపోద్ఘాతం 

----------------------------

కమలా కుచ చూచుక కుంకుమతో 

నియతారుణితాతుల నీల తనో 

కమలాయత లోచన లోకపతే 

విజయీభవ వేంకట శైలపతే

అర్థం: జగన్మాత స్తనాగ్రాలపై ఉన్న కుంకుమతో ఎర్రటి వర్ణం లోకి మారిన నీల దేహం కలవాడివి , పెద్ద పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించేవాడివి, అయిన ఓ లోకపతీ! నీకు విజయం. 

దేవుడు ఆడా మగా? జగన్మాత అని మళ్ళీ ప్రత్యేకంగా ఏమిటి? దేవుడు నీలంగా ఉంటాడా? ఒక వేంకటాద్రి మీదనే ఉంటాడా? ముందు సుప్రభాతంలో మాతః సమస్త జగతాం అని చెప్పి మళ్ళీ ఈ మొదటి రెండు లైన్లు ఏమిటి? 

దేవుడు నీలంగా ఉంటాడు అంటే ఎవరో చూసినట్టు కాదు. ఒక నీలి మబ్బు కమ్ముకున్నట్టుగా మనల్ని తన అనుగ్రహంలో తడిసి ముద్ద చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడుట. ఇలా అనుకోవడం వల్ల ఒక విధమైన ధైర్యం వస్తుంది. భగవంతుడు తెల్లగా ఉంటాడు అంటే స్వచ్ఛతకు ప్రతీక. 

ఇంక కమలాదేవి ఎవరు? కమలంపై ఉండే దేవి, కమలం మార్దవానికి ప్రతీక. ఆవిడని ఎవరైనా చూసారా?

అసలు వాల్మీకి రామాయణంలో సాగర మథనం మొత్తం చెప్పి అమ్మవారు సాగరంలో పునరావిర్భవించిన కథ కూడా చెప్పలేదు. వేదంలో శ్రీసూక్తంలో కూడా రూపం ఇది అని చెప్పలేదు. 

మరి అమ్మవారికి నాలుగు చేతులతో ఒక రూపంతో ఎందుకు కొలుస్తారు? లక్ష్మీ దేవిని సీతగా వాల్మీకి వర్ణించారు. అంతకంటే విలక్షణంగా ఆ సీతకు మూలమైన అమ్మవారిని  అదే వాల్మీకి వర్ణించిన రూపంతో, కానీ  నాలుగు చేతులతో కొలుస్తారు. BTW, వాల్మీకి రామాయణం దేవుడికి శ్యామ వర్ణం  (నల్లని దేహం, కారు మబ్బుని సూచించే విధంగా) చెపుతుంది!

మరి ఆవిడ ఎక్కడ ఉంటుంది? భగవంతుడి వక్షస్స్థలంలో అట. భగవంతుడు అంటే ఏవో నాలుగు చేతులతో ఎవరికీ తెలీని లోకంలో ఉంటాడా? అలాంటపుడు ఆయనని అసలు తలవడం ఎందుకు? అంతకంటే గొప్ప విషయాలు చాలా లేవా?

పురుష సూక్తం విశ్వరూపం చెప్పింది. 

మరి విశ్వరూపం అయితే, ఏది తల, ఏవి చేతులు, వక్షస్స్థలం ఎక్కడ ఉంటుంది?

ఇపుడు వక్షస్స్థలం అనే మాటను తీసేద్దాం. తెలుగు సంస్కృతాల్లో హృదయం, తమిళంలో మార్బు, ఇంగ్లీషులో heart. 

ఎవరైనా సహృదయుడు, kind hearted అంటే అర్థం ఏమిటి? ఎదుటి వారి పట్ల సానుభూతి ఉంది అని అర్థం. 

అలాగే అమ్మవారు భగవంతుడి హృదయంలో ఉంది అంటే, ఆయన దయామయుడు అని అర్థం. ఈ పోస్టు ఏ శ్లోకం గురించి రాయబడ్డదో  ఆ స్తోత్ర రచయిత అణ్ణన్ స్వామి గురువు గారు అయిన శ్రీమద్ వేదాంత దేశికులు అమ్మవారిని శ్రీనివాసుడి దయాదేవిగా చెపుతూ ఒక శతకమే రాసారు. 

దయ కృప శ్రద్ధ ఇవన్నీ మాతృ లక్షణాలు కాబట్టి, భగవంతుడి ఈ లక్షణాన్ని జగన్మాతగా చెప్పారు. అంతే కాకుండా, "మాతా చ కమలా దేవీ పితా దేవో జనార్దనః" అని చాణక్యుడు చెప్పిన శ్లోకం ప్రకారం చూసినా, తల్లిదండ్రుల కాన్సెప్టులో జగన్మాత, జగత్పిత   అని భావిస్తే మనసుకు బావుంటుంది. లేక పోతే నిజానికి భగవంతుడు ఆడా మగా అని చెప్పలేం. జగత్పతి అన్నపుడు మాత్రం  అది పుంలింగంలోనే ఉంది. ఒకే భగవంతుడు తల్లీ, తండ్రీ, పతీ అన్నపుడే ఇది భౌతికంగా ఆలోచించేది కాదు అని తట్టాలి!

పైన వక్షస్స్థలం గురించి చెప్పిన లాజిక్కే సర్వాంతర్యామి కనులకు కూడావర్తిస్తుంది, "కమలాయత లోచన" అన్నప్పుడు. పైగా లక్ష్ అనే ధాతువుకు "ఆలోచనే" అని అర్థం. అంటే తెలుగులో ఆలోచన కాదు. లక్షించి (చూసి) అనుగ్రహించడం, ఆ తత్త్వమే లక్ష్మి. లోకం అన్నా వీక్షించబడేది అని అర్థం. అందుకే అమర కోశ కారుడు లక్ష్మీ దేవిని లోక మాత అన్నాడు.


2వ భాగం 

---------------

కమలా కుచ చూచుక కుంకుమతో 

నియతారుణితాతుల నీల తనో 

కమలాయత లోచన లోకపతే 

విజయీభవ వేంకట శైలపతే

అర్థం: జగన్మాత స్తనాగ్రాలపై ఉన్న కుంకుమతో ఎర్రటి వర్ణం లోకి మారిన నీల దేహం కలవాడివి , పెద్ద పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించేవాడివి, అయిన ఓ లోకపతీ! నీకు విజయం. 

ఇంతకు ముందు భాగంలో నీల తనువు అంటే ఏమిటో చూసాం. కమలాయత లోచన లోకపతే అంటే ఏమిటో చూసాం. భగవంతుడి హృదయం అంటే, ఆయన దయకు సూచకం అనీ, పెద్ద కళ్ళతో వీక్షించడం అంటే, ఆ దయతో సర్వలోకాలనూ చూడటం అనీ కిందటి భాగంలో ప్రస్తావించబడింది. జగన్మాత అంటే కృప మాతృ లక్షణం కాబట్టి, ఒక ఇంట్లో లాగ, జగత్తుకి మాతా పితా ఉన్నారు అనుకుంటే, భద్రతా భావం కలుగుతుంది కాబట్టి వైదిక సంప్రదాయంలో ఇలా భావిస్తారు అని కూడా చెప్పబడింది. 

అసలు భగవంతుడికి దయ ఉండాలా? లేక పోతే వచ్చిన నష్టం ఏమిటి? ఆయన గొప్పతనం ఏమైనా తగ్గుతుందా? అని అడగవచ్చు. 

ఆయన దయామయుడు అనుకోవడం వల్ల ఒక విధమైన సాంత్వన కలుగుతుంది.  అలా కాకుండా ఏదో మెకానికల్ గా కర్మ సాక్షి అనో, ఇంకొకటి అనో అనుకుంటే ఆ confidence  రాదు. దీనికి వేదం, శ్రద్ధయా దేవో దేవత్వం అశ్నుతే అని చెప్పింది. అసలు దేవుడి దేవత్వమే ఆయనకి మనపట్ల ఉన్న శ్రద్ధవల్ల అట.

అంతా బాగానే ఉంది. మధ్యలో ఈ స్తనాలు ఏమిటి? స్తనాగ్రాలు ఏమిటి?

శ్లోక రచయిత సంస్కృతంలో తమిళంలో మహా పండితులు. వారు వేదాంత దేశికుల వద్ద, వరవర మునీంద్రుల వద్ద అధ్యాత్మ విద్యను అధ్యయనం చేశారు. అన్నమయ్యను అర్థం చేసుకోవాలి అన్నా వారి సంప్రదాయంలోని ఈ సుప్రభాత కర్త అయిన అణ్ణన్ స్వామి వంటి వారిని అర్థం చేసుకోవాలి అన్నా ప్రాచీన తమిళ భక్తి సాహిత్యంతో, ముఖ్యంగా ఆళ్వార్ల దివ్య ప్రబంధంతో పరిచయం ఉండాలి. 

ఆళ్వార్ల కవిత్వంలో స్త్రీ స్తనాలు మనం మన పతి అయిన  భగవంతుడికే చెంది ఉండటం (భగవదేక శేషత్వం) అనే దానికి ప్రతీక. వీటిని ఒక కండలు తిరిగిన మగవాడికి, ఒక చీమకు, ఒక బండరాయికి, మొత్తం జగత్తుకు చెప్పవచ్చు. అపుడు మూర్తీభవించిన ఆయన దయాగుణమే అయిన అమ్మవారికి చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 

మరి చూచుక అని (స్తనాగ్రం) అని కూడా ఎందుకు రాశారు?

ముందు కుంకుమతః అన్న దానిని చూద్దాం. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. పైన చెప్పబడ్డ సాహిత్యంలో ఎరుపు వాత్సల్యానికి చిహ్నం. వాత్సల్యం అంటే ఆవు తన లేగదూడని నాకే అంత అభిమానం భగవంతుడికి మనయందు ఉంటుంది. 

దయ, వాత్సల్యం ఇవి అన్నీ ఒకే విధమైన గుణాలు. కాబట్టి అతిశయించిన కరుణతో ఆయన మనల్ని తల్లిలాగ ప్రేమిస్తూ, మనం అంటే వాత్సల్యం కలిగి ఉంటాడు. 

కాబట్టి కమలాదేవి దయ, కృప, శ్రద్ధ ఇలాంటివి సూచిస్తే, ఆయనకే చెందిన ఆయన దయాగుణం అతిశయించి, ఆయన మనల్ని పుత్రవాత్సల్యంతో ఆవు తన దూడ మలిన భూయిష్టమైన శరీరాన్ని అత్యంత ప్రీతితో ఇష్టపడినట్టుగా, దగ్గరకు తీసుకుంటాడు. 

ఈవిధంగా కమల-దయ,  కుచాలు - ఆవిడ భగవంతుడి అధీనంలో ఉండటం. కుచ చూచుకం - భగవంతుడికి మనపై దయ తారాస్థాయికి వెళ్లడం. కుంకుమ - వాత్సల్యం (ఎరుపురంగు కారణంగా). 

ఇందుచేత ఆయన నీలమేఘం వంటి శరీరం ఎర్రగా మారిందిట! ఇవీ ఇందులో ఉన్న సంకేతార్థాలు. 

అందుకే ఈ ఫోటో పెట్టడం జరిగింది. ఈ ఫొటోలో ఎంత శృంగారం ఉందో, అంతే శృంగారం ఈ శ్లోకంలో కూడా ఉంది!

ప్రశ్నలు - సమాధానాలు:

---------------------------------

1. శృంగారాన్ని శృంగారంగా చూడాలి. ఇలా మార్చెయ్యడం ఏమిటి?

ముందు కవిత్వాన్ని కవిత్వంగా చూడటం నేర్చుకోండి. ఒకాయన నేను ఒక అన్నమయ్య కీర్తనకు ఇదే రకంగా  అర్థం చెపితే ఏడుపు సింబల్ పెట్టాడు, పైగా రచయితట.  కవిత్వం తెలిసిన వారు నిజానికి మనకు చెప్పాలి, poetic symbolism అనేది ఒకటి ఉంటుంది అని. 

నేను చెప్పిన సంకేతార్థాలు ఈ శ్లోక రచయిత సంప్రదాయంలో చాలా మందికి తెలిసినవే. 

దేవుడు తన కృపతో రక్షించును, ఆయనను స్తుతింపుడి అంటే అది కవిత్వం కాదు, అదేదో ప్రార్థన అవుతుంది.

2. ఇక్కడ జగత్తుకి తల్లిదండ్రుల మధ్యనే కదా చెప్పబడింది. భార్యాభర్తల మధ్య ధర్మబద్ధం అయిన శృంగారం లేకపోతే ముఖ్యంగా ఈ ప్రపంచానికి తల్లిదండ్రుల మధ్య, అసలు ఈ సృష్టి ఉంటుందా అండి?

శ్రీరామాయణంలో బ్రహ్మ "అహం తే హృదయం రామ" అని భగవంతుడితో అంటాడు. అంటే, విష్ణువు హృదయమే బ్రహ్మ. ఆయన ఎపుడు ఎలా సంకల్పిస్తే అపుడే అలాగే సృష్టి అని అర్థం. ఇంక ఈ ప్రశ్న మరీ చిన్న పిల్లల ప్రశ్నలా ఉంది. త్రిమతాలకు చెందిన మేధావులం అనుకునే వారు అడగదగ్గది కాదు. కొంచెం ఆలోచించండి. అదేదో తంత్ర శాస్త్ర గ్రంథం (నాకు ఎలా తెలుసు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 90ల్లో ఇలాంటి భావజాల వ్యాప్తి కోసం వార పత్రికల్లో కూడా వేసే వారు) చెప్పినట్టుగా దేవీ దేవుల (శ్రీవారు, అమ్మవారు కాదు) ప్రణయం వల్ల ఈ ప్రపంచం సంభవించలేదు, శ్లోక కర్త సంప్రదాయం ప్రకారం.

3. మరి అన్యమతస్థులు, నాస్తికులు ప్రశ్నిస్తే?

పైన నేను చెప్పినది అయితే శ్లోక కర్త అధ్యయనం చేసిన సాహిత్యం ప్రకారం. లేదూ మీకు తెలిసిన పద్ధతిలో సమాధానం ఇవ్వండి. గౌరవ ప్రదమైన చర్చ ఓకే. ఎదుటి వారు దూషిస్తే పోలీసు కంప్లైంట్ ఇవ్వండి.

4. మరి శృంగార పరమైన సాహిత్యం ఆధ్యాత్మికతలో నిషేధమా?

అద్వైతులు జీవ బ్రహ్మల ఐక్యానికీ, విశిష్టాద్వైతులు జీవుడూ బ్రహ్మా (అంటే పరబ్రహ్మం) కలిసి ఆనందించడానికీ  సంకేతార్థంగా భాగవత శ్లోకాలనీ, రెండవ వారు అయితే తమిళ పాశురాలనీ ఇంకా భాగవతం మొదలైన పురాణ శ్లోకాలనీ , ఉపయోగిస్తారు. అలాగే చాలా అన్నమయ్య కీర్తనలు కూడా ఇదే కోవకు వస్తాయి. ఈ శృంగారంలో ప్రతీకలు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే కాల పరిమితి ఉన్నదానికంటే అనంతంగా ఉండేది చాలా గొప్పది కదా? నిజానికి ఇది  అర్థం చేసుకున్న వారికి చాలా మంచి ఆలోచనలు కలిగి కామ క్రోధాలు తగ్గుతాయి.