Sunday 19 September 2021

Viswaprakasunaku - A humble attempt to decode a deeply philosophical song

 అన్నమయ్య సంకీర్తన సంఖ్య 155సంపుటం 1

రాగము :హంసనాదం
స్వరకర్త :శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
గానం: శ్రీమతి శ్రావణి గంటి



విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ
శాశ్వతున కూహింప జన్మ మిక నేడ //పల్లవి //













ఈ విశ్వం అంతా శ్రీమన్నారాయణుడి శరీరమే. విశ్వంలో సమస్తానికీ లోపలా బయటా ఆయన వ్యాపించి ఉన్నాడు. అటువంటి విష్ణుదేవుడికి ఏది లోపల బయట? "అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః" అని నారాయణ సూక్తం చెపుతోంది. సర్వత్రా ఉండి శాశ్వతుడైన వాడికి జన్మ ఏమిటి? నిజానికి రాముడిగా కృష్ణుడిగా ఆయన మనకోసం ఆవిర్భవించాడు కానీ ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వచ్చి అవతారం చెయ్యలేదు. ఇది నరసింహస్వామి విషయంలో స్పష్టంగా తెలిసిందే కదా.

సర్వ పరిపూర్ణునకు సంచారమిక నేడ
నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ
వుర్వీధరునకు గాలూద నొకచోటేడ
పార్వతీస్తుత్యునకు భావమికనేడ //విశ్వ //

సర్వత్ర ఉన్నవాడికి ఇంక సంచారం అనేది ఏమిటి? ఆయన ఎక్కడినుండో వచ్చి మనల్ని రక్షించాలి అని అనుకోవక్కర్లేదు. ఆయన లేని ప్రదేశం ఏది? ఆయన ఎక్కడ అనుగ్రహిస్తే అక్కడే మనకు రక్షణ. ఆయనే మోక్షస్వరూపుడు. ఇంక ప్రత్యేకంగా వేరే పరమపదం గురించి చింత ఎందుకు? వికుంఠులు అంటే భగవద్ అనుభవానికి ఏ అడ్డంకీ లేని వారు. అలాంటి వారికి లభించినవాడు కాబట్టి స్వామిని వైకుంఠుడు అన్నారు. శ్రీవిష్ణు సహస్రనామంలో అణుర్ బృహత్ కృశః స్థూలః అని ఉన్న చోట బృహత్ అన్న నామానికి అన్నమయ్య పూర్వాచార్యులైన పరాశర భట్టార్యులు "పరమాత్మ అన్న భావన ముందు పరమపదం కూడా చులకన అయి ఉంటుంది" అని తెలిపారు. ఆళ్వార్లు కానీ అన్నమయ్య కానీ, ఆంజనేయుల వారు కానీ కోరుకున్నది నిరంతరం ఆయనకి దాస్యమే కానీ ఫలానా చోటు కాదు. సమస్త భూమండలాన్నీ ఆయనే ధరిస్తున్నాడు. ఇంక ఫలానా దివ్యక్షేత్రంలో మాత్రమే ఆయన కాలు మోపాడు అని ఎలా అంటాం? అసలు మొత్తం భూమిని ఆయనే మోస్తుంటే, ఇంకా కాలు మోపడానికి ఒక ప్రదేశం మాత్రమే ఎలా దొరుకుతుంది? శ్రీవిష్ణుసహస్ర నామం పూర్వ పీఠికలో అనాది నిధనం విష్ణుం అన్న చోట విష్ణుం అన్నదానికి అదేశోపాధికం అని పరాశర భట్టార్యులు చెప్పారు. స్వామి సర్వత్ర ఉన్నవాడు కాబట్టి ఏ ప్రదేశం పైనా కూడా ఆయన అనుగ్రహం ఆధార పడి లేదు.

కేనోపనిషత్తులో దేవతలందరూ తమ విజయాలకి తామే కారణం అని గర్విస్తూంటే, పార్వతీ దేవి ప్రత్యక్షమై, అగ్నిలోని దహించే శక్తీ, వాయువులోని వహించే శక్తీ, ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ ఇచ్చినవే అని వారికి ప్రబోధిస్తుంది. ఆవిడ ప్రత్యక్షానికి ముందు ఇంద్రుడు పరబ్రహ్మని సమీపించబోతే స్వామి అంతర్ధానం అవుతాడు. ఈ విధంగా సమస్తానికీ కారణంగా పార్వతీ దేవి చేత స్వామి చెప్పబడగా, ఆయన ఉనికి ఎక్కడో ఒక చోట అని ఎలా చెపుతాం? ఆయన గురించి ఎక్కడ అని భావన చెయ్యగలం?
 
నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ
ఆనన సహస్రునకు నవ్వలివ లేడ
మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ
జ్ఞానస్వరూపునకు గానవిన వేడ //విశ్వ //

ఆయన అనాది నిధనుడు, విష్ణువు, కాబట్టి, మొదలు, మధ్య అంటూ ఏమీ ఉండదు. ప్రపంచం అంటా ముఖాలు కలిగిన వాడు కాబట్టి లోపల బయట అంటూ ఏమీ లేదు. ఏ వస్తువుకైనా లోపలా బయటా ఆయనే. తన సంకల్పంతో దేనికైనా అంతర్లీనంగా ఉంటాడు, దేని లోపలనుంచైనా వ్యక్తపరచుకోగలడు. మౌనం అంటే మనన శీలత్వం. భగవంతుడిని నిరంతరం మననం చేసే వారు మౌనులు. అటువంటి వారి హృదయంలో అంతర్యామిగా వారి బుద్ధిని గాయత్రీ మంత్రంలో చెప్పినట్టుగా ప్రేరేపించే అంతర్యామి మనకు ప్రత్యక్షమై మాట్లాడవలసిన పని ఏమి ఉంది? మనం ఆయనని తలవడం ఆయన ప్రేరణ వల్లే! ఆయన జ్ఞాన స్వరూపుడు. సర్వేశ్వరుడి జ్ఞానం అంటే సమస్త వస్తు సాక్షాత్కారం. ఇంక ఆయన ప్రత్యేకంగా వినవలసింది చూడవలసింది ఏమి ఉంది? భగవంతుడు నాకు ప్రత్యక్షం కావాలి, నా మొర వినాలి అని అనుకునే వారికి ఆచరణాత్మకమైన బోధ చేస్తూనే లోతైన జ్ఞానాన్నిఇక్కడ అన్నమయ్య అందిస్తున్నారు.
పరమ యోగీంద్రునకు పరులేడ తానేడ
దురిత దూరునకు సంస్తుతి నిందలేడ
తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ
హరికి నారాయణున కవుగాము లేడ //విశ్వ //

యుజ్ అనే ధాతువును కలిపి ఉంచడం విషయంలో వాడతారు. సమస్త జీవులతో నిత్యం కలిసి ఉండే ఆ యోగీశ్వరుడికి పరులు అంటూ ఎక్కడ ఉంటారు? తననుండి విడిగా ఎవరూ ఉండరు.
ఆయన సమస్త దురితాలకీ దూరమైన వాడు. ఆ విధంగా ఏ దోషం లేని వాడికి స్తుతి ఏది? నింద ఏది? మన స్తుతి నిందలతో ఆయన ఔన్నత్యానికి సంబంధం లేదు.
ఇంక సర్వత్ర ఉన్న ఆ శ్రీవేంకటేశ్వరుడికి ప్రత్యేకంగా ఆలయాల్లో విగ్రహం ఎక్కడ? సమస్త విశ్వం ఆయన శరీరమే కదా!

మరి మన తృప్తి కోసం ఆయనని విగ్రహ రూపంలో అర్చించినపుడు, ఆయన రూప విశేషాలని ఆయన కళ్యాణ గుణాలకి ప్రతీకలుగా తీసుకోవాలి. మనం అర్చించే మూర్తిలో ఆ సర్వాంతర్యామి ఉన్నాడు అనే పరిపూర్ణ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి.
పుణ్యపాపాల్ని హరించి, సమస్త విశ్వాన్నీ సంహరించే ఆ హరికి, జీవులని అందరినీ వహించే ఆ నారాయణుడికి, ఏదైనా అవడం కాకపోవడం ఎక్కడ ఉంటుంది? సంభవించే సర్వమూ ఆయన సంకల్పమే. అది ఎపుడూ అప్రతిహతమైనది.