Saturday 2 April 2022

The term Anjanadri as explained by Annamayya

అన్నమాచార్య కీర్తన: అణురేణు పరిపూర్ణమైన 

రాగం: షణ్ముఖ ప్రియ

స్వరకర్త: శ్రీమాన్ వేద వ్యాస ఆనంద భట్టర్ స్వామి 

పాడిన వారు: శ్రీమతి శ్రావణి గంటి 

కీర్తన వ్యాఖ్యానంతో బాటు వినడం  కోసం ఈ క్రింది ఆడియో  లింక్ క్లిక్ చేయండి:


https://www.youtube.com/watch?v=pT6eikswZg0

పల్లవి:

అణురేణు పరిపూర్ణమైన రూపము

అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము

పరమాత్మ ముండకోపనిషత్తులో చెప్పినట్టుగా సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. పెద్దవి అనుకునే వాటి కన్నా పెద్ద వాడు. 

భగవంతుడి సూక్ష్మ స్వభావాన్ని అంజన వర్ణత్వం అని ఆళ్వార్లు అంటారు. అంటే కాటుక రేణువులవలె సూక్ష్మమైన స్వభావం కలవాడు. 

అందుకే ఆ నల్లనయ్యని అంజన వర్ణుడు అనీ, అంజన మేని వాడు అనీ అంటారు. ఆయన పర్వతరూపిగా పూజించబడే తిరుమలని అంజన వెఱ్పు అంటారు. కాటుక కొండ లేక కాటుక స్వభావం కల సర్వేశ్వరుడు ఆరాధించబడే కొండ అని అర్థం. సర్వలోకాలకీ అంతర్యామి అయిన విశ్వరూపుడు కొన్ని మైళ్ళ పొడవైన కొండగా  ఆళ్వార్ల చేత ప్రస్తుతించబడటం కూడా ఆయన కాటుక వంటి స్వభావం వల్లనే సాధ్యం కదా. అందుకే నేడు తిరుమల శ్రీవారి ఆలయంలోని దేవుడు కొండంత దేవుడిగా కోట్లాది భక్తుల చేత నుతించబడుతున్నాడు. 

గోదాదేవి తండ్రి విష్ణుచిత్తుల వారు తన చందమామ రావే పాశురాల్లో ఇలా అంటారు. 



ఎన్ శిఱుక్కుట్టన్ ఎనక్కు ఓర్ ఇన్నముదు ఎం పిరాన్ 
తన్  శిఱుక్కైగళాల్ కాట్టిక్కాట్టి అళైక్కిన్ఱాన్
అంజనవణ్ణనోడు  ఆడలాడ ఉఱుదియేల్ 
మంజిల్ మఱైయాదే మా మదీ మగిళ్న్దోడివా!

నా చిన్ని పిల్లవాడు, నాకు అమృతం లాంటి తండ్రి, తన చిట్టి చేతులతో ఓ చందమామా! నిన్ను పిలుస్తున్నాడు. అంజనవర్ణుడైన ఈ పిల్లవాడితో ఆడాలని ఉంటే మబ్బుల వెనక దాక్కోకయ్యా! అని యశోదా భావంలో విష్ణుచిత్తులు చందమామని పిలుస్తున్నారు. 

ఇంకా తర్వాతి పాశురంలో విష్ణుచిత్తుల వారు ఇలా అన్నారు. 

శుత్తుం ఒళి వట్టం శూళ్న్దు శోది పరందు ఎంగుం 
ఎత్తనై శెయ్యిలుం ఎన్ మగన్ ముగం నేరొవ్వాయ్
విత్తగన్ వేంగడ వాణన్ ఉన్నై విళిక్కిన్ఱ 
కైత్తలం నోవామే అంబులీ కడిదోడి వా!

చుట్టూ పరచుకొన్న వెన్నెలతో ఎంతో మనోహరంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నా, మా అబ్బాయి ముఖానికి నువ్వు ఎంత చేసినా  సరి రావు.  సర్వకారణభూతుడైన నా చిన్ని వేంకటేశ్వరుడు నిన్ను తన చేతులతో పిలిచి పిలిచి అవి  ఎంత నొప్పి పుట్టాయో చూడు. ఓ చందమామా? త్వరగా రావయ్యా!

ఈ రెండు పాశురాలనీ చూస్తే, సర్వత్రా ఉన్న శ్రీనివాసుడితో పోలిస్తే చంద్రుడు చిన్న అణువు  లాంటి వాడు. స్వామి యశోద చేతుల్లో పసి బిడ్డగా మారి తన కంటే పరిమాణంలో చాలా చిన్నవాడైన చంద్రుడితో ఆడటానికి సిద్ధమయ్యాడు. అంజన వర్ణుడు కదా! 

అణిమాది అష్ట  సిద్ధులు ఉన్నాయి అని పురాణాల్లో అంటారు. ఇందులో అణిమ అంటే చాలా సూక్ష్మరూపంలోకి మారడం. అందుకే అణిమాది సిరులు ఆ అంజనవర్ణుడైన శ్రీకృష్ణుడిగా పూజించబడే అంజనాద్రికి సహజ సిద్ధమైనవి. 

చరణం 1:

వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

వేదాంతం అంటే ఉపనిషత్తులు. వాటిని అధ్యయనం చేసిన వారు శ్రీహరి స్వభావం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ స్వామి దొరకడు. ఎందుకంటే కఠ ముండకోపనిషత్తుల్లో చెప్పినట్టు పరమాత్మ ఎవరిని వరిస్తే వారికే దొరుకుతాడు. 

యోగీంద్రులు అంటే భగవంతుడితో తమ నిత్య సంబంధం, కేవలం ఆయన దయ కారణంగా తెలుసుకొన్నవారు. వారు స్థిరంగా ఆయననే భావిస్తారు. ఎవరిని అంటే స్వామి పుష్కరిణి వద్ద ఉన్న దైవాన్ని!  తమిళంలో కోన్ అంటే స్వామి. ఏరి అంటే మడుగు. అలాగ కోనేరి అనే పదం వచ్చింది. అదే సంస్కృతంలో స్వామి పుష్కరిణిగా మారింది.

చరణం 2: 

పాలజలనిధిలోన (బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము

స్వచ్ఛమైన పాల కడలిలో మెత్తటి శేషుడిపై యోగ నిద్రలో జగద్ రక్షణ చింతనం చేసే రూపం ఈ శేషాచల రూపమే. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు 

యదాదిత్య గతం తేజో 
జగద్ భాసయతేఖిలం 
యచ్చంద్రమపి యచ్చాగ్నౌ 
తత్తేజో విద్ధి మామకం

ఈ విధంగా సూర్యుడిలోని చంద్రుడిలో అగ్నిలోని తేజస్సు శ్రీవారి రూపమే. 

శ్రీవైకుంఠంలో తన నిత్య అనుభవం కోసం వెలసినది ఈ శ్రీవారి రూపమే. వేరే శ్రీవైకుంఠం గురించి తపించక్కర్లేదు. 

వీటన్నిటికీ లోగుట్టు ఈ శేషగిరి రూపమే! సందేహం లేదు. 

చరణం 3: 

ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము

పరబ్రహ్మ మఱ్ఱి ఆకు మీద బాలకృష్ణుడిగా పవళించి బ్రహ్మనీ బ్రహ్మాండాలనీ సృష్టించాడు అని పురాణాలు అంటాయి.  అలాగే సృష్టి జరిగిన ప్రతిసారీ ఒక్కో బ్రహ్మని సృష్టిస్తాడు. చిన్న పిల్లవాడిగా సృష్టించాడు అని చెప్పడంలో  ఈ సృష్టి మొత్తం స్వామికి చిట్టి పాపాయి ఆట వంటిది అని అర్థం ఉంది.   

అలాంటి పరమేశ్వరుడు మమ్మల్ని ఏలడానికి శ్రీవేంకటాద్రి మీద విచ్చేశాడు. "ఈ రూపమై ఉన్నాడు ఈతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీవేంకటేశుడు" అనే అన్నమాచార్య కీర్తనే దీనికి పరమ ప్రమాణం. 

అకిఞ్చన నిధిమ్ సూతిం అపవర్గ త్రివర్గయోః
అంజనాద్రీశ్వర దయాం అభిష్టౌమి నిరంజనామ్ 

అన్నమాచార్యర్ తిరువడిగళే శరణం 
ఆళ్వార్ ఎమ్బెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం