Friday 5 August 2022

The cloud and the lightning!

తాళ్లపాక పెద తిరుమలాచార్య కీర్తన
॥పల్లవి॥
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె
స్వామి ముఖంలో కళలు ఒకదానితో ఒకటి వయ్యారంగా పోటీపడుతూ మరీ ఆవిష్కరించబడ్డాయిట. ఏమిటి ఆ కళలు అంటే ఎంతైనా చెప్పవచ్చు. కళ్ళు, విల్లు లాంటి కనుబొమలు, చిరునవ్వుతో కూడిన పెదాలు, ముంగురులు, వీటన్నిటినీ వర్ణించుకుంటూ పోతే ఎంతైనా చెప్పవచ్చు. సర్వత్ర ఉన్న దేవుడికి కళ్ళు ఏమిటి, నోరు ఏమిటి అని అడిగితే దానికీ సమాధానం ఉంది!
॥చ1॥
జగదేకపతిమేనఁ జల్లిన కర్పూరధూళి
జిగిగొని నలువంకఁ జిందఁగాను
మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గనక
పొగరువెన్నెల దీగఁబోసినట్లుండె
జగత్పతి శ్రీవేంకటేశ్వరుడి తిరుమంజన సమయంలో (అభిషేకం) ఆయనపై చల్లిన కర్పూరం అన్ని వైపులా చిందగా, అది చంద్రముఖి అయిన అమ్మవారి వెన్నెలా అన్నట్టుగా ఉందిట!
అమ్మవారు చంద్రముఖి అయితే ఆయన ఆ చంద్రుడికి నివాసం అయిన ఆకాశం. వ్యాపకత్వ లక్షణం ఉన్న కర్పూరం వెన్నెల లాగ ఉంది.
ఉరమున నిలిపె అంటే తన వక్షస్స్థలం మీద ఆ దయాదేవికి ఆధారం ఏర్పరిచాడు. ఇంతకు ముందు ఒక సారి రాసినట్టుగా హృదయాన్ని దయకి స్థానంగా చెపుతారు. ఇది చాలా సాధారణమే.
॥చ2॥
పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసిన తట్టుపుణుఁగు
కరఁగి యిరుదెసలఁ గారఁగాను
కరిగమనవిభుఁడు గనక మోహమదము
తొరిగి సామజసిరి దొలఁకినట్లుండె
పునుగు పిల్లి నుంచి స్రవించే కస్తూరి ఎంతో చక్కటి వాసన కలిగినది. ఈ విధంగా కస్తూరి మృగాన్ని భగవంతుడి విభూతిగా (special manifestation) భావించి దాని నుంచి వచ్చిన కస్తూరితో ఆయనకి తిలకం దిద్దుతారు. అభిషేక సమయంలో ఆయన చెక్కిళ్ళకు రాసిన కస్తూరి కిందకు కారగా, అది ఏనుగు మదం లాగా ఉందిట. ఎలా అంటే ఆవిడ కరిగమన కాబట్టి (ఏనుగు వంటి నడక కలది, స్త్రీలని ఇలా పోలుస్తారు) దానికి అనుగుణంగా ఒక మదపుటేనుగు మదం తొలికినట్టుగా.
ఈ మోహం ఎవరి మీద అంటే, తన కృప అయిన ఆవిడ మీద. తన కృపకి వశుడై మనల్ని అనుగ్రహిస్తాడని అర్థం.
ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. ఆవిడ ఈశ్వరి అయితే ఆయన ఆవిడకే ఈశ్వరుడు. శ్రీశః అంటే శ్రీకి ఈశ్వరుడు, తనకి శ్రీని ఈశ్వరిగా కలిగినవాడు అని రెండు అర్థాలు ఉన్నాయి.
శ్రీరామాయణంలో అయితే అమ్మవారూ అయ్యవారూ ఒకపరికొకపరి అన్నట్టుగా ఇద్దరూ కూడా, భగవంతుడు సూర్యుడు అయితే అమ్మవారు సూర్యప్రభ అని పోటీ పడి మరీ చెపుతారు.
శ్రీవారు "అనన్యార్హా మయా సీతా భాస్కరేణ ప్రభా యథా" అంటే, అమ్మవారు "అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా" అని అంటారు.
॥చ3॥
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తఱచయిన సొమ్ములు ధరియించఁగా
మెఱుఁగుఁబోణి యలమేలుమంగయుఁ దాను
మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె
ఆయన శరీరం మీద స్వర్ణాభరణాల్ని ధరించగా, ఆ ఆభరణాలే మెరుపు తీగల్లాగా, ఆయన కారుమబ్బు లాగా అనిపించింది. నారాయణ సూక్తంలో "నీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా" అన్నదానికి అర్థం కారుమబ్బువంటి శ్రీమన్నారాయణుడిలో జగన్మాత విద్యుల్లేఖ అంటే మెరుపు తీగ లాగా భాసిస్తోందట. కారుమబ్బు కరుణని వర్షించడానికి సిద్ధంగా ఉన్న స్వామికి సంకేతం అయితే, మెఱుపు ఆయనని మనకి దర్శింపచేసేది. మెఱుపు వచ్చీ పోయినట్టుగానే ఆయన మనకి తెలిసీ తెలియకుండా ఉంటాడు! శ్రీవేంకటాచలంపై మాత్రం నిరంతరం అనుగ్రహిస్తూనే ఉంటాడు!
మొదటి రెండు చరణాల్లో వ్యాపక లక్షణాలు ఉన్న కర్పూరం, వెన్నెలా, కస్తూరిలని ఎంచుకోవడం కూడా భగవంతుడూ ఆయన కృపల వ్యాపకత్వానికి చిహ్నం.