Monday 30 December 2019

Essence of Bhagavad Gita


ప : అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో

విని ఆతని భజించు వివేకమా




వివరణ:
ఉపనిషత్తుల సారమైన భగవద్గీత అత్యంత విజ్ఞాన దాయకమైనది. భగవంతుడే జీవుడి ఉనికికి ఆధారం అనీ, పోషకుడు, రక్షకుడు ఆయనే అని, ఆయనను స్మరించడం, విస్మరించడం ఆయన సంకల్పం వల్లనే అనీ స్వామి స్వయంగా అర్జునుడికి భగవద్గీతలో ఆనతిచ్చిన వైనాన్ని అన్నమయ్య మనకు ఈ కీర్తనలో ఉపదేశిస్తున్నారు. వివేకంతో ఆయనని భజించమని బోధిస్తున్నారు.

చ : భూమిలోను చొచ్చిసర్వ భూతప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడనేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడనేను

గీతలో  పురుషోత్తమ ప్రాప్తి యోగం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా 
పుష్ణామి చౌషధీస్సర్వాః  సోమో భూత్వా రసాత్మకః 

నేను భూమిలో ప్రవేశించి సమస్త భూతాలనీ నా శక్తితో ధరిస్తాను. చంద్రుడి రూపంలో  పంటలన్నీ వృద్ధి చెందేలా  వాటికి తగిన తేమను కల్పిస్తాను. 

ఇక్కడ అన్నమయ్య ఓషధి అంటే మొక్క అనే అర్థాన్ని ఉపయోగించారు. భూమి మీద మొలిచే ప్రతి మొక్కా ప్రాణులకి ఉపయోగపడుతుంది. రసాత్మకః అన్న దానికి తేమలను కలిగించే వాడు అని అర్థం చెప్పారు. చంద్రుడు లేని వాతావరణంలో జీవరాశిని భూమిపై ఊహించలేము. 

కామించి అంటే సంకల్పించి అని అర్థం. పంటల్ని పండించడమే కాదు, ప్రారంభం నుంచి కూడా కలిగించేది ఆయనే కదా. అందుకే కలిగించి అన్నారు. 

చ : దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తేపుల నఱగించేటి దేవుడనేను
ఏపున ఇందరిలోని హృదయములోననుందు
దీపింతు తలపు మరపై దేవుడనేను

గీతలో  తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం. 

నేను జఠరాగ్ని రూపంలో జీవుల శరీరంలో ఉండి ప్రాణ వాయువు సరిగా కలిగేలా, తేనుపులు సరిగా వచ్చేలా ఏర్పరుస్తాను . తద్వారా నాలుగు విధాలైన  అంటే పళ్ళు, పెదాలు, నాలుకని మూడు విధాలుగా  ఉపయోగించి తినేది , ఇంకా ద్రవరూపమై తాగబడేది (ఖాద్య చోష్య లేహ్య పేయ రూపకమైన ఆహారం)అయిన ఆహారం జీర్ణమయ్యేలా చూస్తాను. ఈ శ్లోకంలో పరమాత్మ ఆయుర్వేద విశేషాన్ని బోధిస్తున్నాడు. 

ఆ పై శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటాడు:

సర్వస్య చాహం హృది సన్నివిష్టో 
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ 
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః 
వేదాంతకృత్ వేదవిదేవ చాహం. 

అందరి హృదయాల్లోనూ నేను చక్కగా ప్రవేశించి ఉంటాను. నా వలనే జ్ఞానం, తలపు, మరపు ఏర్పడతాయి. ఇక్కడ తమస్సుని పోగొట్టే జ్ఞానాన్ని అన్నమయ్య దీపించుట  అన్నారు. 


 చ : వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచే
ఆదినే నెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితో గూడి శ్రీ వేంకటాద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను

రెండవ చరణంలో అన్నమయ్య ఉదహరించిన  శ్లోకంలో స్వామి ఇంకా ఇలా చెపుతున్నాడు:

వేదాలన్నిటి చేత తెలుసుకోదగిన వాడిని నేనే. వేదాంతాన్ని ప్రసాదించినదీ, వేదం పూర్తిగా తెలిసినదీ నేనే. ఇక్కడ వేదం అంటే జ్ఞానం. స్వామి సర్వజ్ఞుడు.

ఇక్కడ వేదాంతవేత్తలచే అని చెప్పడం ద్వారా జ్ఞానులైన గురువులచే జగత్తుకి, వేదాలకు ఆదిగా తెలుసుకోదగిన వాడు స్వామి అని అన్నమయ్య భావం. దీనిని "తద్విద్ధి ప్రణిపాతేన" అనే జ్ఞానయోగంలోని గీతా శ్లోకంతో కలిపి అర్థం చేసుకోవాలి.

భగవద్గీత మోక్ష సన్న్యాస యోగంలో స్వామి ఇలా చెపుతారు:

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

అన్ని ధర్మాలని పక్కన పెట్టి  సర్వేశ్వరుడినైన నన్ను మాత్రమే నన్ను పొందటానికి ఉపాయంగా స్వీకరించు. నిన్ను అన్ని ప్రతిబంధకాలనుండీ నేను విముక్తుణ్ణి చేస్తాను. బాధ పడవద్దు.



దీనికి అన్నమయ్య "శ్రీదేవితో గూడి శ్రీవేంకటాద్రిమీద పాదైన దేవుడను" అని చెప్పారు.  సంస్కృతంలో శ్రయణాన్ని సూచించే శ్రీ  శబ్దం భగవంతుడు మనకు శరణు ప్రసాదించడాన్ని సూచిస్తుంది.  వేంకటమ్ అనే సంస్కృత పదం వేంగడం అనే ద్రావిడ పదంనుంచి వచ్చింది. వేం అంటే వేడి, కడంగళ్ అంటే కష్టాలు. భగవత్ ప్రాప్తికి కలిగే ఆటంకాలు అన్నీ భగవదనుగ్రహంతో మాడి మసైపోతాయి అని వేంకటమ్ అనే పదం తెలుపుతుంది. ఇలా అన్నమయ్య చరమ శ్లోకంగా చెప్పబడే ఈ శ్లోకాన్ని శ్రీ శ్రీనివాసుల పరంగా సరిగ్గా చెప్పారు.

పాదైన అన్నమాట ఈ విషయంలో స్వామికి స్థిరత్వాన్ని సూచిస్తోంది.

ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా
కృపయా దిశతే శ్రీమద్ వేంకటేశాయ మంగళం|

Audio courtesy by Smt Sravani Ganti



Saturday 28 December 2019

Lord's grace showering on us

మచ్చికతో నేలవయ్య మదనసామ్రాజ్యలక్ష్మి
పచ్చి సింగారాలచేత బండారాలు నిండెను
॥పల్లవి॥
కొమరెతురుమునను గొప్పమేఘ ముదయించి
చెమటవాన గురిసెఁ జెక్కులవెంట
అమరఁ బులకలపైరు లంతటానుఁ జెలువొంది
ప్రమదాలవలపులపంట లివె పండెను
॥॥
మించులచూపుల తీగెమెఱుఁగు లిట్టె మెరిచి
అంచెఁ గోరికలజళ్లవె పట్టెను
సంచితపుకుచముల జవ్వనరాసులు మించె
పొంచి నవ్వుల మాని పోదిగొనె నిదిగో
॥॥
అలమేలుమంగమోవియమృతము కారుకమ్మి
నలువంక మోహపుసోనలు ముంచెను
యెలిమి శ్రీవేంకటేశ ఇంతి నెట్టె కూడితివి
కొలఁదిమీరి రతులకొటార్లు గూడెను

వివరణ:పల్లవి:

జీవేశ్వరుల సంయోగాన్ని, శ్రీమన్నారాయణుడి కృపనీ, ఈ కీర్తన తెలియచేస్తుంది. ఒకే కీర్తనలో జీవుడిని ఆయన ప్రియురాలిగా, ఆయన పట్టమహిషి జగదీశ్వరిని ఆయన కృపగా తెలపడం ఈ కీర్తన ప్రత్యేకత. 


మచ్చికతో ఏలవయ్య అంటే జీవుడిని అభిముఖుడిని చేసుకొని ఏలుకొమ్మని అర్థం. ఇద్దరూ అభిముఖులైతేనే కదా సంయోగం రక్తి కట్టేది! మద్ అనే ధాతువుని తృప్తి, హర్షం అనే అర్థంలో వాడతారు. కాబట్టి మదన సామ్రాజ్య లక్ష్మి అంటే జీవుడి బ్రహ్మానుభూతి అనే సంపద.

ఇంక "పచ్చి సింగారాల చేత బండారాలు నిండెను" అన్నదానికి అర్థం రెండవ చరణం రెండవ భాగంలో దొరుకుతుంది.

చరణం 1:

కొమెర (జీవుడు - ఈ పాటలో నాయిక) తురుములో అంటే జడలో గొప్ప మేఘం ఉదయించింది.  గొప్ప మేఘం అంటే నీల మేఘ శ్యాముడైన స్వామి. ఆయన దయని అందరిమీదా తారతమ్యం లేకుండా వర్షిస్తాడు కాబట్టి ఈ ఉపమానం చెపుతారు. 
జడలో స్వామి ఉదయించడం ఏమిటి? కేశాలు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానోదయం కాగానే ఆయన దయ వర్షించింది. ఇక్కడ చెమట నాయికదో, స్వామిదో చెప్పలేదు! స్వామిదే అయి ఉంటుంది. ఎలా అని అడక్కండి! అప్పుడే స్వామి దయామృత వర్షి అన్నది ఇక్కడ కుదురుతుంది.  
పులకలు బ్రహ్మానందానుభూతి. 
కృష్ణుడు అంటే భక్తిని కృషి (వ్యవసాయం) చేయువాడు అని అర్థం. అందుకే ఆయన ప్రమదాల వలపు పంట జీవుడిలో పండిస్తాడు!

చరణం 2:
నారాయణ సూక్తం "నీల తోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా" అని అమ్మవారి గురించి చెపుతుంది. పరమాత్మ తన కరుణని వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలమేఘం లాంటి వాడైతే ఆయనని దర్శింపచేసే మెరుపు తీగ జగన్మాత. ఈ ఉపమానం మనం అన్నమాచార్యుల "ఒకపరికొకపరి వయ్యారమై" కీర్తన ఆఖరి చరణంలో కూడా చూడవచ్చు. 
ఒకసారి మెరుపు మెఱయగానే మేఘం కనిపించింది. వర్షం మొదలైంది. ఇక భగవంతుడిని విరహ తాపంతో కోరుకుంటున్న జీవుడి కోరికలన్నీ జడివానలాగ తీరాయి. లేదూ ఆయనే జీవుడిని ఏరి కోరి అనుభవిస్తున్నాడని కూడా చెప్పవచ్చు. 

కుచములు అన్నమాచార్యుల వారి సంప్రదాయంలో శేషత్వం అనే లక్షణాన్ని సూచిస్తాయి. దీని అర్థం ప్రియురాలు ప్రియుడికి మాత్రమే చెందినట్లు జీవుడు భగవంతుడికి మాత్రమే చెందటం. ఇది జడ పదార్థాలకూ అమ్మవారికీ కూడా వర్తిస్తుంది. 

తాను స్వామికే చెందిన వాడిని అనే భావం జీవుడికి అతిశయించగా, పరమాత్మ యథేచ్ఛగా జీవుడిని బ్రహ్మానందంలో ముంచెత్తుతున్నాడు అని అర్థం. 

చరణం 3:
జీవుడిని అనుగ్రహించమని అనుక్షణం స్వామికి చెప్పేది శ్రీదేవి. ఆవిడ పై చరణంలో మెరుపుతో పోల్చబడింది. ఇక్కడ తన అమృతవాక్కులతో స్వామికి చెప్పగానే ఆశ్రితుడిపై ఆయనకి ఉన్న వ్యామోహం అన్ని వైపులా కమ్ముకొంది. ఇక్కడ మేఘం (స్వామి) ఉరుముతో కూడా అమ్మవారి వాక్కుని పోల్చవచ్చు. అమ్మవారు ఇలా స్వామికి చెప్పడాన్ని అన్నమయ్య సంప్రదాయంలో పురుషకారం (recommendation) అంటారు. 

అంతే, వెంటనే స్వామి జీవుడిని చేరుకొన్నాడు, దానితో జీవుడికీ పరమేశ్వరుడికీ శాశ్వతంగా యోగం కూడింది! 



Sunday 15 December 2019

Useful links - A good blog on Annamyya songs

Here is one more blogspot with no twisted interpretations and the philosophy in the songs is presented rightly to a great extent.

http://annamacharyulu.blogspot.com/

Tuesday 10 December 2019

In front of Him in sync and assured of His accepting us

తాళ్లపాక చినతిరుమలాచార్య
రేకు: 12-5 సంపుటము: 10-70

పల్లవి:

సవతులమైనాను సంగతి దప్పదగునా
రవళి వావిలిపాటి రామచంద్రు ముందర ॥పల్లవి॥

వివరణ:

ఇద్దరు భాగవతుల మధ్య సంభాషణ ఇది. జీవులందరు భగవంతుడికి భార్యలే. ఒక్కొక్క సారి బిడ్డలే. ఈ కీర్తనలో భార్యలుగా తీసుకొంటేనే నప్పుతుంది. 

భగవదనుగ్రహం కలిగిన ఒక జీవుడు మరొక జీవుడితో ఇలా అంటున్నాడు. 
మనం ఇద్దరమూ స్వామికి భార్యలమే. స్వామి భక్తులైన మనం సవతులం కదా అని అయన ఎదురుగా సంగతి, స్వరం తప్పవచ్చునా? అంటే పరస్పరం స్నేహభావంతో మెలగాలి అని అర్థం. సహ నౌ భునక్తు అన్నట్టు కలిసి భగవదనుభవం పొందాలి. 

1వ చరణం:


01.నీవనగా నే ననగా నిష్టూరా లేటికే
చేవదేరే మాట లెల్ల చిగిరించీని
మోవరాని దూరు లెల్ల మోపులు గట్టగాను
వేవేగ నిన్నియు మనవిభుడు మోచీనా ॥సవతుల॥

వివరణ:
శ్రీరామాయణంలో స్వామి "సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ" అంటాడు. అంటే "నన్ను  శరణు వేడిన సమస్త జీవులకి అభయాన్ని ఇస్తాను, ఇదే నా వ్రతం" అని చెపుతాడు. 
నిన్ను రక్షిస్తాడు అంటే నిన్ను రక్షిస్తాడు అంటూ అని నిష్ఠురాలు పోవడం దేనికి?  "అభయం సర్వభూతేభ్యో" అని అయన శ్రీరామాయణంలో అన్న మాట నాకు గుర్తుకు వస్తోంది. ఆయన ఏలుకోడు  అని నిందించడం ఎందుకు? దీని అంతటితో వేగిపోతే ఆయన మనల్ని మోస్తాడా?

ఇక్కడ రెండు విషయాలు చూడాలి. స్వామిపై నాయికకు ఉన్న ప్రేమాతిశయం మొదటిది. ఆయన సున్నితమైన మనస్సు ఎంత నొచ్చుకుంటుందో మనం వేసే నిందలు ఆయనకి ఎంత భారం అవుతాయో అని నాయిక భయం. రెండవది ఆయన తప్పక మోస్తాడు అన్న మహా విశ్వాసం.  ఈ రెండవ భావం మన భారం అంతా స్వామిదే అనే నిబ్బరాన్ని ఇస్తుంది. 
2వ చరణం:
02.కాదనగా నౌననగా కరకరేమిటికే
మీద మీద జగడాలు మితిమీరీని
వాదుల యీ సుద్దు లెల్ల వాములు వెట్టెగాను
కాదని మనవిభుడు గాదెల బోసీనా ॥సవతుల॥

వివరణ:
నీకు మాపై ప్రేమ ఉందనీ, కాదు, లేదనీ ఆయనపై మన ఈ కరకర కొరకరలు దేనికి ?  రోజు రోజుకి మనకి ఆయనతో గొడవలు మరీ ఎక్కువై పోతున్నాయి. ఈ వాదులాటలు అన్నీ మోపులకొద్దీ అయితే కాదని మన స్వామి వాటిని ఏమైనా గాదెలో పడేసి ఉంచుతాడా? కాదు, తప్పక మనల్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తాడు అని భావం.

3వ చరణం:
03.రమ్మనగ పొమ్మనగ రారాపు లేటికే
దొమ్మి రేగి కాకలు తోదోపు లాడీని
నమ్మించి శ్రీవెంకటనాథుడు నిన్ను నన్నును
సమ్మతిగాగూడగాను సతము లై తిమిగా. ॥సవతుల॥

వివరణ:
స్వామితో రమ్మనీ పొమ్మనీ ఈ కఠినమైన ఘర్షణలు దేనికి? విరహ తాపంతో మనం ఇద్దరం స్వామిని కలవడానికి ఒకరు అంటే ఒకరు అని ఉన్నాం. ఎలాగో నమ్మించి ఆయన మనల్ని తన సమ్మతితో కూడడంతో మనకి ఒక అర్థవంతమైన అస్తిత్వం (సత్త) వచ్చింది కదా!