Thursday 24 December 2020

You are My everything!

శ్రీవిష్ణు సహస్ర నామం పూర్వ పీఠిక వ్యాఖ్యానంలో అన్నమాచార్యుల పూర్వాచార్యులైన పరాశర భట్టార్యులు ధ్యానం అన్న పదానికి భగవద్ గుణ అనుచిన్తనం అని నిర్వచనం ఇచ్చారు. భగవంతుడి గుణగణాలని స్మరించడాన్ని మించిన ధ్యానం లేదు. దీనికి సుమధురమైన    కీర్తనల రూపంలో అవకాశాన్నిమనకి ప్రసాదించిన వారు అన్నమాచార్యులు.  

ఈ కీర్తనలో అన్నమయ్య భగవన్నామ కీర్తన ద్వారా భగవద్గుణానుభవం చేస్తున్నారు. 

Click here for an audio visual by Smt. Sravani Ganti.




పల్లవి:

అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ

వివరణ: 

తాపాలనీ పాపాలనీ హరించే శ్రీహరే నాకు సర్వస్వం.

పుండరీకాక్షుడు అంటే తామర పువ్వుల వంటి పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించే వాడు. కాబట్టి, లోకంలో ఎక్కడకు వెళ్లినా ఆయన చూస్తూనే ఉంటాడు. ఇంకా తామర పువ్వుల వంటి పాదాలని జ్ఞానులకు దర్శింపచేసే వాడు అని కూడా అర్థం ఉంది. జ్ఞాని అయిన వాడికి ఎటు చూసినా ఆ త్రివిక్రముడి పాదాలే కనిపిస్తాయి. 

అందరినీ ఆనందింప చేసేవాడు రాముడు. అలాంటి భగవంతుడు ఎపుడూ నా చెంతన ఉన్నాడు. రఘురాముడు అని చెప్పడంలో మన కోసం ఆయన దశరథ కుమారుడిగా రఘుకుల తిలకుడిగా   అవతరించడం ఉంది. 

చరణం 1:


కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ

వివరణ: 

శ్రీవిష్ణు సహస్రనామంలో మహా వరాహో గోవిందః అన్న చోట గోవింద నామానికి అర్థం భూమిని పొందిన వాడు అని అర్థం. ఆ భూదేవికి మగడైన గోవిందుని కులమే భూలోక వాసులైన మన అందరిదీ. అన్నమయ్య ఇంకో కీర్తనలో అన్నట్టుగా ఇందులో జంతుకులం ఇంతా ఒకటే! అంతా ఆ శ్రీహరే కాబట్టి ఆయనే మన కులం. 

కరుణానిధి అయిన ఆ శ్రీనిధే మన పెన్నిధి. 

సమస్తాన్నీ ధరించేది ధరణి. ఆ ధరణిని ధరించే ధరణీధరుడే మన ధారణా శక్తి. ఆయన కృప వల్లనే ఆయనని మనం గుర్తు పెట్టుకోగలం. 

సృష్టికర్త అయిన బ్రహ్మకి తన నాభికమలంలో స్థానాన్ని ఇచ్చిన ఆ పద్మనాభుడే  నా నివాసం. 


చరణం 2:


తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా


వివరణ: 

మన అహంకార మమకారాలని నాశనం చేసి ఇంద్రియాలని నిగ్రహించే వాడు మధుసూదనుడు. కాబట్టి ఆ మధుసూదనుడే నా అర్థవంతమైన మనుగడ. 

మాయతో అందరినీ బంధించే ఈశ్వరుడు యశోదా దేవి చేత తాళ్లతో రోకలికి కట్టి వెయ్యబడ్డాడు. అందువల్ల ఆయనని దామోదరుడు అని పిలుస్తారు. తన సంకల్పంతో  నన్ను ఈ శరీరానికి బద్ధుడిని చేసిన ఆ దామోదరుడే నా శరీరం. దామోదరుడు అంతర్యామిగా ఉన్న ఆత్మని దామోదరుడు అంతర్యామిగా ఉన్న శరీరంతో ఆ దామోదరుడే తన మాయచే కట్టి వేసాడు. ఆహా! ఎంత అద్భుతమో కదా!  

భగవన్నామ శ్రవణమే  నాకు వినికిడి. 

నాకు వెనుక ముందు అన్ని వైపులా ఉన్నది ఆ విశ్వరూపుడైన విష్ణు దేవుడే. 

























చరణం 3:
పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే


వివరణ: 

పురుష సూక్తంలో చెప్పినట్లు సృష్టికంతటికీ మూలమైన ఆ పురుషోత్తముడే నా పుట్టుక. నరులందరికీ అంటే జీవులందరికీ మార్గం అయిన నారాయణుడే నా చిట్ట చివరి గమ్యం. రెండింటి మధ్య అంతా కూడా ఆయనే. భగవద్గీత విభూతి యోగంలో స్వామి "అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ" అన్నదానికి అనువాదమే ఈ చరణంలో మొదటి భాగం. 

ఏ విధంగా అయినా ఓ శ్రీవేంకటేశా! నువ్వే నా గతివి, నాకు వేరే గతి లేదు, లేదు, లేదు.