Friday 1 September 2023

సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడీలో

అన్నమాచార్య కీర్తన
సంపుటి 2
-----------
సంఖ్య 517
------------
పల్లవి:
-------
సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడీలో
మతిలోన మెచ్చి మెచ్చి మన్నించు రమణుఁడా
చరణం 1:
----------
కనుసూటి వలపు కాంత చూచిన చూపు
కొనకెక్క మరుఁడదె గురులేసెను
మొనకత్తిసామూ ములువాఁడి కొనగోరు
పెనఁగి చెక్కులనొత్తి పేరెము వారెను ॥సతి॥
చరణం 2:
----------
చేసూటి వలపూ చెలి కాఁగిలించినది
బాసతోనే కాయజుఁడు పందెమాడెను
మూసిదింపు మొరఁగూ ముంచిన పయ్యద కొంగు
ఆసలు నీకుఁ జూపి ఆయాలు రేఁచెను ॥సతి॥
చరణం 3:
-----------
మొగసూటి వలపూ మోహపు రమణి నవ్వు
తగవుతో మదనుఁడు దారగట్టెను
అగపడి శ్రీ వేంకటాధిప నీవు గూడితి
జగడమింతయుఁ దీరి చనవు చేకొనెను ॥సతి॥





వివరణ:
---------
ఇందులో కఠినమైన తెలుగు శబ్దాలకి భాషా పండితుల లేదా నిఘంటువు సహాయంతో అర్థం తెలుసుకోవచ్చు.
స్థూలంగా చూస్తే ఈ విషయం బోధపడుతుంది.
అన్నమయ్య సిద్ధాంతంలో నాయిక నాయకుడు తనను చేరుకోవాలి అని కోరుకుంటుంది కానీ నాయకుడిని చేరుకోవడానికి ఏ ప్రయత్నం చెయ్యదు. నాయకుడు నాయిక నా సొంతం అని యథేచ్ఛగా నాయికతో ఆనందించాలి. ఇది బ్రహ్మానందానుభూతి. స్త్రీ పురుషుల మధ్య శృంగారం ఒక సంకేతం మాత్రమే. జీవేశ్వరుల సంయోగం ఇంకా గాఢంగా ఉంటుంది. సంకేతార్థాలతో చెప్పబడుతుంది. వీటిని కొంచెం చెప్పి వదిలేస్తాం! అలా చెప్పీ చెప్పనట్లుగా ఉంటేనే అందంగా ఉంటుంది. ఎవరైనా మానవులకీ ఇతర జంతువులకీ సాధారణమైన తాత్కాలికమైన పరిమిత శృంగారాన్ని వెదికితే అది వారి దురదృష్టం.
ఇక్కడ నాయిక యొక్క చూపులు మన్మథ బాణాలతో సమానం అయినవి. మన్మథుడు బాణాలని నాయకుడి మీద వేసాడు. అంటే నాయిక నాయకుడి పైన కేవలం ఆభిముఖ్యం (సిద్ధాంత పరంగా ఇది కూడా ఆయన అనుగ్రహించినదే) కలిగి ఉంది. ఏ విధమైన ప్రయత్నం చెయ్యలేదు నాయకుడిని కలవడానికి.
పయ్యద కొంగు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి చెప్పుకోవాలి. స్తనాలు శేషత్వాన్ని అంటే నాయిక నాయకుడికే చెంది ఉండటాన్ని సూచిస్తాయి. ఇందులో శృంగార భావన ఉందా లేదా అనేది అర్థం కావాలి అంటే ప్రాచీన భక్తి సాహిత్యం తెలిసి ఉండాలి! కుదృష్టితో పరిమిత శృంగారాన్ని వెదికే వారు అనుకునే దానికంటే చాలా ఎక్కువే ఉంది అని మాత్రం చెప్పగలను. ఇంకా పయ్యద కొంగు అంటే ఆ శేషత్వ బుద్ధి కప్పబడింది. అయితే?!
చివరిలో భగవంతుడు జీవుడిని (నాయకుడు నాయికని) కూడటం జరిగింది. అన్నమయ్య శృంగార కీర్తనల్లో సాధారణంగా ఇలాగే జరుగుతుంది.

ఇప్పుడు పల్లవిని విశ్లేషిస్తే, ఏ ప్రయత్నమూ లేకుండానే సతి పతిని "జవ్వనపు యుద్ధంలో" గెలుచుకొంది! అంటే ఆయన అనుగ్రహంతోనే వాళ్ళు ఇద్దరూ (ఆయనా, జీవుడూ) ఒక్కటి అయ్యారు అని అర్థం!
అన్నమయ్య శృంగార కీర్తనల్లో ఆధ్యాత్మికత ఏమిటి అన్నవాళ్ళు ఉన్నారు. ఇందులో నాయిక అంటే కళ్ళూ చెవులూ ఉన్న రేపో మాపో మట్టిలో కలిసే శరీరం కాదు. అదే విధంగా వేంకటేశ్వరుడు అంటే ఒక మనిషి కాదు. కాబట్టి ఇష్టం ఉన్నా లేక పోయినా తప్పదు.
ఇవి అమ్మమ్మ తాతయ్య భావనలు అసలు కాదు! అన్ని విధాలైన సాధనలనీ నిరసించి భగవంతుడు ఊరికే అనుగ్రహిస్తాడు అని చెప్పే విలక్షణమైన సిద్ధాంతం అన్నమయ్యది. దీని వల్లన జీవితంలో ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ కూర్చోకుండా సాటి మానవులకి ఉపయోగపడే మనస్తత్త్వం ఏర్పడుతుంది. మనం చేసే కర్మలు కూడా ఆయన సంకల్పం వల్ల జరిగేవే అని చెప్తారు కొన్ని చోట్ల. దీనివల్లన ప్రతి దానికీ పాపం పుణ్యం అనే భయంతో కాకుండా భగవత్ ప్రేమతో, ఆయన సృష్టి మీద ప్రేమతో మనిషి నడుచుకొంటాడు.

The symbolism behind samASrayaNa ritual in Sri Annamacharya's religion

 తాళ్లపాక పెదతిరుమలాచార్య సంకీర్తన

-----------------------------------------
హరిముద్ర ధరించక అర్చించఁ బాత్రుఁడు గాఁడు...
రేకు: 0020-03,సంపుటం: 15-113
Ragam : hamsanaadam (హంసనాదం)
Singer : Pravasthi Aaradhya
Composer : Sri Vyzarsu Balasubrahmanyam garu
ఉపోద్ఘాతం:
------------
అన్నమాచార్యుల వారి ఉద్దేశ్యం ప్రకారం, భగవంతుడు నిర్హేతుక కృపతో ఊరికే ఎవరినైనా అనుగ్రహిస్తాడు. దానికి వారు వీరు అని లేదు. వాలి కావచ్చు, జటాయువు కావచ్చు, గోపికలు కావచ్చు, శిశుపాలుడు కావచ్చు.
ఈ ఆత్మ అనేది శ్రీహరికి చెందినది తప్ప స్వతంత్రమైనది కాదు. ఇలాంటి భావాలనే వారి కుమారులు కూడా కలిగి ఉన్నారు.
భగవంతుడు ఎవరినైనా అనుగ్రహించేటప్పుడు ముద్రాధారణం అనే తమ సంప్రదాయానికి మాత్రమే చెందిన ఒక ప్రక్రియపై ఎందుకు కీర్తన వ్రాసారు? ఇక్కడ విశ్లేషిద్దాం.
ఇపుడు ఒక పాత్ర మీద శంఖం చక్రం గుర్తులు వేశారు అనుకుందాం. దానిని ఎందుకు వినియోగిస్తారు? స్వామి ఆరాధనలో. అలాగే కోవెలలో ఇలాంటి పాత్రలు చూడవచ్చు.
అదే విధంగా ఆత్మ ఏ విధంగా భగవంతుడికి చెందినదో, ఆ ఆత్మని ఈ శరీరంలో ఆ భగవంతుడే పెట్టాడు కాబట్టి, ఈ శరీరం కూడా జన్మనిచ్చిన ఆ భగవంతుడిదే అని గుర్తించడమే అన్నమాచార్యుల సంప్రదాయంలో ముద్రాధారణం యొక్క ఆంతర్యం. ఆసక్తి ఉన్న వారికి ఆఖరికి బ్రిటిష్ వారి కాలంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఆలయ ఆచార్యులతో ఈ ముద్రాధారణ (సమాశ్రయణ) కార్యక్రమాన్ని నిర్వహించేది అని బ్రూస్ కోడ్ అనే పుస్తకం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు తెలిసినవే!
అలా భౌతికంగా ధరించకుండా కూడా ఆయన వారిమి అని తెలిసిన వారు ఎందరో ఉన్నారు. అలా ధరించిన వారిలో దుర్మార్గులూ ఉన్నారు!
మరి ఈ కీర్తన ఎందుకు?
మనం ఒక ముద్ర పడింది అని తెలుగులో అంటాం, ఆధునికులం స్టాంప్ అని కూడా అంటాం. దీని అర్థం ఏమిటి? మనం ఫలానా రకమైన వారిమి అనే కదా? అలాగే ముద్రని ధరించిన వారు అంటే, భగవదనుగ్రహాన్ని పొందినవారు అని తీసుకుంటే సరిపోతుంది.
॥పల్లవి॥
హరిముద్ర ధరించక అర్చించఁ బాత్రుడు గాడు
వెరవుగా సోదించి వినుకొండో
వివరణ: ఋచ్ - స్తుతౌ అనే ధాతువు ప్రకారం వెళితే, భగవంతుడిని స్తుతించడమే అర్చన. దానికి ఎవరు అర్హులు? ఆయన ముద్ర పడిన వారు, అంటే ఆయన అనుగ్రహానికి పాత్రులు అయినవారు అని అర్థం.
అన్నమాచార్య స్వామి వారికీ, వారి కుమారులకీ, వేదాత్ శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ అన్నట్లుగా భగవంతుడే ప్రమాణం. అయినప్పటికీ, శాస్త్ర ప్రమాణం అనేది మన ritualistic societyలో అడుగుతారు (అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు, ఆచార్యుల వారు మాత్రం మనకన్నా చాలా ముందు ఉన్నారు) కాబట్టి తమ సంప్రదాయంలో పై అంతరార్థం ఉన్న ప్రక్రియని ఈ విధంగా సమర్థిస్తున్నారు.
॥చ1॥
ఆరసి చక్రాంకిత మనిన మాట
ద్వారకలో కృష్ణుడన్న ధర్మము గాదా
భారతములో నున్నదే పంచమవేదమిది
సూరలుగా సోదించి చూచుకొండో
వివరణ:
ద్వారకలో ప్రవేశించే వారికీ అక్కడ ఉండేవారికీ శంఖ చక్ర ముద్రలు ఉండి తీరవలసిందే అని 5000 ఏళ్ల క్రితం పరమాత్మ శ్రీకృష్ణుడు ఒక కట్టడి చేసాడు. ఇది పంచమవేదంగా చెప్పే భారతంలో ఉంది.
॥చ2॥
తేటగా భుజచక్రద్విజాతినవని
తాటించి వైఘానసులు ధరించే ధర్మమిది
నూటొక్క ఋషులిడిన నూటొక్క సంతలందు
ఘాటముగా సోదించి కనుకొండో
వివరణ:
ముద్రలని ధరించడం అనేది శ్రీవైఖానస ఆగమానికి చెందిన వారు పాటించే ధర్మం. తిరుమలలో ఈ ఆగమం ప్రకారమే అర్చన చేస్తారు (కొందరు అపోహ పడినట్టుగా వీరు ఒక నామం, పాంచరాత్ర ఆగమం వారు మరొక నామం ధరించరు, ఇద్దరిలోనూ రెండు ఊర్ధ్వపుండ్రాలూ ఉన్నాయి). ఈ ఆగమానికి చెందిన చెందిన ఆలయాలు తిరుమల, చెన్నై పార్థసారథి ఆలయం, శ్రీపెరుంబూదూరు రామానుజాచార్య-కేశవస్వామి ఆలయం, శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ అమ్మవారి ఆలయం, మంగళగిరి, ద్వారకాతిరుమల, మొదలైనవి.
యజ్ఞో వై విష్ణు: యజ్ఞం విష్ణువే (భగవంతుడిని పొందటానికి భగవంతుడే సాధనం) అని చెప్పే యజుర్వేదం నూటొక్క శాఖలు కలిగినది. ఈ శాఖలకు చెందిన ఋషులు అందరూ హరి ముద్రలని ధరించేవారు. ఎలా అంటే, అహం వేద్మి మహాత్మానమ్ .. అని విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో (బాలకాండ 19. 14) చెప్పినట్లుగా విశ్వామిత్రుడూ, వసిష్ఠుడూ మొదలైన గొప్ప యోగులు మాత్రమే కాదు, తాపసులు అందరూ శ్రీహరి భక్తులే. అన్నమాచార్య సాంప్రదాయానికి పరమవైదిక మతం అనే నామధేయం కూడా ఉంది. వీరి సాంప్రదాయ గురువులని శ్రీమద్ వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్యులుగా సంబోధిస్తారు.
॥చ3॥ యెంచఁ దాపపుణ్డ్రనామ హితమంత్ర యాగమని
పంచసంస్కారము చెప్పే పాంచరాత్ర ధర్మ మిది
అంచల శ్రీవేంకటేశు ఆనతి నయిదు లక్షలు
సంచితమైన శాస్త్రము చదువు కొండో
అన్నమాచార్యుల వారి సంప్రదాయంలో ఇంకొక ప్రసిద్ధమైన ఆగమం శ్రీపాంచరాత్ర ఆగమం. వారి సాంప్రదాయ ఆలయాలు అంటే పైన చెప్పినట్టుగా శ్రీవైఖానస ఆగమం ప్రకారం అయినా ఇక్కడ చెప్పిన శ్రీపాంచరాత్ర ఆగమం ప్రకారం అయినా నడుస్తూ ఉండాలి. శ్రీరంగం, అహోబిలం, కాంచీపురం, యాదగిరిగుట్ట, సింహాచలం ఉదాహరణలు. ఇక్కడ కూడా వేరు వేరు ఊర్ధ్వపుండ్రాలని చూడవచ్చు.
ఈ ఆగమం తాప పుండ్ర నామ హితమంత్ర యాగ - అనే ఐదు సంస్కారాలు చెపుతుంది (నిజమైన సంస్కారం భగవదనుగ్రహం మాత్రమే అనే విషయం అలా ఉంచి, ఒక సంప్రదాయంలో ఉన్నపుడు కొన్ని పద్ధతులు పాటిస్తారు). ఇందులో తాపం అంటే అగ్నిలో ఉంచిన శంఖ చక్ర ముద్రలను శరీరంపై ధరించడం. పుండ్రము అంటే ఊర్ధ్వపుండ్రాలు (నామం) ధరించడం. నామం అంటే దాస్య నామం ధరించడం. నేను భగవంతుడికీ భాగవతులకీ దాసుడిని అని అర్థం. హితమంత్రం అంటే అష్టాక్షరి, ఈ మంత్రం ఉపదేశం పొందటం. ఆ తర్వాత ఈ మంత్రార్థాన్ని తెలుసుకొని ఆ అర్థాన్ని మననం చేస్తూ ఆ అర్థానికి తగినట్లుగా జీవించడం. అష్టాక్షరి కన్నతల్లి కంటే ఉపకారం చేస్తుంది అంటారు. ఈ మంత్రం పైన చెప్పిన శ్రీవైఖానస ఆగమంలో కూడా చాలా ముఖ్యమైంది. యాగం అంటే దేవపూజనం. ఇకపైన శిష్యుడు చేసే పూజ అంతా తన ఆచార్యుడు చేయిస్తున్నట్టుగా భావిస్తూ చెయ్యాలి.
రెండవ చరణంలో చెప్పిన శ్రీవైఖానసం, మూడవ చరణంలో చెప్పిన శ్రీపాంచరాత్రం, రెండూ శ్రీవేంకటేశ్వరుడు అంటే శ్రీమన్నారాయణుడు ఆనతి ఇచ్చినవే.
ఇక్కడ అయిదు లక్షలు అనే సంఖ్య ఎలా వచ్చింది అనే నా సందేహాన్ని భద్రాచలం ఆలయ వేదపండితులు శ్రీమాన్ ఉ.వే.ప్ర. గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్య స్వామి వారు తీర్చారు. వారికి అనేక నమస్సులు.
శ్రీపాంచరాత్రం పాద్మ సంహితలో (తిరుచానూరు అలమేలు మంగమ్మ వారి ఆలయంలో దీని ప్రకారమే అర్చనలు చేస్తారు) ఇలా ఉంది:
సార్ధకోటి ప్రమాణేన బ్రహ్మణా కేశవాత్ సృతమ్
కపిలాయ దదౌ బ్రహ్మా లక్షాణామ్ పఞ్చకమ్ తతః
కోటీ యాభై లక్షల శ్లోకాల శ్రీపాంచరాత్ర ఆగమాన్ని కేశవుడు బ్రహ్మకి ఉపదేశించగా, బ్రహ్మ మళ్ళీ ఆ కేశవుడి అవతారమే అయిన కపిలమహర్షికి ఐదు లక్షల శ్లోకాలతో ఉపదేశించాడు. ఇప్పుడు అన్ని ఉన్నాయో లేదో తెలీదు కానీ, 103 సంహితలతో శ్రీపాంచరాత్రం "చరితమ్ రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్" అన్నట్లుగా విలసిల్లుతోంది.