Monday 30 December 2019

Essence of Bhagavad Gita


ప : అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో

విని ఆతని భజించు వివేకమా




వివరణ:
ఉపనిషత్తుల సారమైన భగవద్గీత అత్యంత విజ్ఞాన దాయకమైనది. భగవంతుడే జీవుడి ఉనికికి ఆధారం అనీ, పోషకుడు, రక్షకుడు ఆయనే అని, ఆయనను స్మరించడం, విస్మరించడం ఆయన సంకల్పం వల్లనే అనీ స్వామి స్వయంగా అర్జునుడికి భగవద్గీతలో ఆనతిచ్చిన వైనాన్ని అన్నమయ్య మనకు ఈ కీర్తనలో ఉపదేశిస్తున్నారు. వివేకంతో ఆయనని భజించమని బోధిస్తున్నారు.

చ : భూమిలోను చొచ్చిసర్వ భూతప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడనేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడనేను

గీతలో  పురుషోత్తమ ప్రాప్తి యోగం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా 
పుష్ణామి చౌషధీస్సర్వాః  సోమో భూత్వా రసాత్మకః 

నేను భూమిలో ప్రవేశించి సమస్త భూతాలనీ నా శక్తితో ధరిస్తాను. చంద్రుడి రూపంలో  పంటలన్నీ వృద్ధి చెందేలా  వాటికి తగిన తేమను కల్పిస్తాను. 

ఇక్కడ అన్నమయ్య ఓషధి అంటే మొక్క అనే అర్థాన్ని ఉపయోగించారు. భూమి మీద మొలిచే ప్రతి మొక్కా ప్రాణులకి ఉపయోగపడుతుంది. రసాత్మకః అన్న దానికి తేమలను కలిగించే వాడు అని అర్థం చెప్పారు. చంద్రుడు లేని వాతావరణంలో జీవరాశిని భూమిపై ఊహించలేము. 

కామించి అంటే సంకల్పించి అని అర్థం. పంటల్ని పండించడమే కాదు, ప్రారంభం నుంచి కూడా కలిగించేది ఆయనే కదా. అందుకే కలిగించి అన్నారు. 

చ : దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తేపుల నఱగించేటి దేవుడనేను
ఏపున ఇందరిలోని హృదయములోననుందు
దీపింతు తలపు మరపై దేవుడనేను

గీతలో  తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం. 

నేను జఠరాగ్ని రూపంలో జీవుల శరీరంలో ఉండి ప్రాణ వాయువు సరిగా కలిగేలా, తేనుపులు సరిగా వచ్చేలా ఏర్పరుస్తాను . తద్వారా నాలుగు విధాలైన  అంటే పళ్ళు, పెదాలు, నాలుకని మూడు విధాలుగా  ఉపయోగించి తినేది , ఇంకా ద్రవరూపమై తాగబడేది (ఖాద్య చోష్య లేహ్య పేయ రూపకమైన ఆహారం)అయిన ఆహారం జీర్ణమయ్యేలా చూస్తాను. ఈ శ్లోకంలో పరమాత్మ ఆయుర్వేద విశేషాన్ని బోధిస్తున్నాడు. 

ఆ పై శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటాడు:

సర్వస్య చాహం హృది సన్నివిష్టో 
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ 
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః 
వేదాంతకృత్ వేదవిదేవ చాహం. 

అందరి హృదయాల్లోనూ నేను చక్కగా ప్రవేశించి ఉంటాను. నా వలనే జ్ఞానం, తలపు, మరపు ఏర్పడతాయి. ఇక్కడ తమస్సుని పోగొట్టే జ్ఞానాన్ని అన్నమయ్య దీపించుట  అన్నారు. 


 చ : వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచే
ఆదినే నెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితో గూడి శ్రీ వేంకటాద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను

రెండవ చరణంలో అన్నమయ్య ఉదహరించిన  శ్లోకంలో స్వామి ఇంకా ఇలా చెపుతున్నాడు:

వేదాలన్నిటి చేత తెలుసుకోదగిన వాడిని నేనే. వేదాంతాన్ని ప్రసాదించినదీ, వేదం పూర్తిగా తెలిసినదీ నేనే. ఇక్కడ వేదం అంటే జ్ఞానం. స్వామి సర్వజ్ఞుడు.

ఇక్కడ వేదాంతవేత్తలచే అని చెప్పడం ద్వారా జ్ఞానులైన గురువులచే జగత్తుకి, వేదాలకు ఆదిగా తెలుసుకోదగిన వాడు స్వామి అని అన్నమయ్య భావం. దీనిని "తద్విద్ధి ప్రణిపాతేన" అనే జ్ఞానయోగంలోని గీతా శ్లోకంతో కలిపి అర్థం చేసుకోవాలి.

భగవద్గీత మోక్ష సన్న్యాస యోగంలో స్వామి ఇలా చెపుతారు:

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

అన్ని ధర్మాలని పక్కన పెట్టి  సర్వేశ్వరుడినైన నన్ను మాత్రమే నన్ను పొందటానికి ఉపాయంగా స్వీకరించు. నిన్ను అన్ని ప్రతిబంధకాలనుండీ నేను విముక్తుణ్ణి చేస్తాను. బాధ పడవద్దు.



దీనికి అన్నమయ్య "శ్రీదేవితో గూడి శ్రీవేంకటాద్రిమీద పాదైన దేవుడను" అని చెప్పారు.  సంస్కృతంలో శ్రయణాన్ని సూచించే శ్రీ  శబ్దం భగవంతుడు మనకు శరణు ప్రసాదించడాన్ని సూచిస్తుంది.  వేంకటమ్ అనే సంస్కృత పదం వేంగడం అనే ద్రావిడ పదంనుంచి వచ్చింది. వేం అంటే వేడి, కడంగళ్ అంటే కష్టాలు. భగవత్ ప్రాప్తికి కలిగే ఆటంకాలు అన్నీ భగవదనుగ్రహంతో మాడి మసైపోతాయి అని వేంకటమ్ అనే పదం తెలుపుతుంది. ఇలా అన్నమయ్య చరమ శ్లోకంగా చెప్పబడే ఈ శ్లోకాన్ని శ్రీ శ్రీనివాసుల పరంగా సరిగ్గా చెప్పారు.

పాదైన అన్నమాట ఈ విషయంలో స్వామికి స్థిరత్వాన్ని సూచిస్తోంది.

ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా
కృపయా దిశతే శ్రీమద్ వేంకటేశాయ మంగళం|

Audio courtesy by Smt Sravani Ganti



No comments:

Post a Comment

Comments are welcome.