Wednesday 19 February 2020

Serving His devotees superior to serving Him

ఉన్నమాట లిక నేల వో దేవా
యెన్నటి కిదేమాట యింకా నింకాను                   // పల్లవి //

వివరణ:

శ్రీ విష్ణు సహస్రనామంలో విజితాత్మా విధేయాత్మా అన్నట్లుగా పరమాత్మ తన భక్తులకి తానే విధేయుడు. భగవదనుగ్రహంతో భగవంతుడిని ఆశ్రయించినవారు కర్మపాశానికి బద్ధులు కారు. దీనినే శరణాగతి అంటారు. 

భగవంతుడిని ఆశ్రయించడం కన్నా భాగవతులని ఆశ్రయించడం ఉత్తమమైనది. అలా భాగవతులని ఆశ్రయించినవారు ఎన్నటికీ చెడరు. వేరే ఎన్నో మాటలెందుకు? నన్ను నీ దాసుల దాసుడిగా ఎప్పటికీ పరిగణించి ఏలుకో అంటున్నారు అన్నమయ్య. 

చరణం 1:


కొంత నా కర్మఫలము కొంత నీ రక్షకత్వము
యింతలో రెండు గలవా యేమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను
చెంతఁ గాచుట నీపని సేవసేయ నాపని         // ఉన్న //

వివరణ:

నా పుణ్యపాప ఫలాల వల్ల భవబంధాల్లో కొంత ఇరుక్కున్నాను అంటారు. నీ రక్షకత్వం వల్ల నీకు కొంత దగ్గరవుతున్నాను. నిజంగా నువ్వు రక్షకుడివైతే నేను కర్మబంధాల్లో ఇరుక్కుంటానా?  సర్వాంతర్యామిగా నీవు నన్ను ఆడిస్తున్నావు. నేను నీ చేతిలో ఆడే బొమ్మనే తప్ప నాకు స్వాతంత్య్రం ఏమీ లేదు. నన్ను రక్షించే బాధ్యత నీదే. నీ దాసులకు సేవ చెయ్యడం నాకు సహజమైన విధి. "అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను" అనడం  "ఈశ్వరః సర్వ భూతానాం హృద్దేశే అర్జున! తిష్ఠతి, భ్రామయన్ సర్వ  భూతాని యంత్రారూఢాని మాయయా" అన్న గీతా శ్లోకం యొక్క సారాంశం. 

చరణం 2:


నే నపరాధి నయ్యేది నీవు వహించు కొనేది
యీ నెపాలు రెండూ నేల యేమో దేవా
మానక యిట్లయితే నీ మహిమకు గురుతేది
ఆని చింతించే నందుల కపకీర్తి యనుచు     // ఉన్న //

వివరణ:

నేను అపరాధ చక్రవర్తిననీ నీవు దయతో నన్ను రక్షించే భారాన్ని వహిస్తావు అనీ అంటారు. ఈ రెండూ ఎందుకు? నీ చేత రక్షించబడితే నేను అపరాధాలు ఎందుకు చేస్తాను? ఇలా అయితే నీకు అపకీర్తి రాదా? దీనికి ముగింపు పలకకపోతే ఇంక నీ మహిమ ఎలా తెలుస్తుంది?  అని చింతిస్తున్నారు అన్నమయ్య. 

చరణం 3:


మెదలే నా యధమము మీ ఘనత యెంచి కావు
యిదియే నా విన్నపము యేమో దేవా
యెదుట శ్రీవేంకటేశ యిన్నిటా నీ బంటు బంట
పదివేలు నా నేరాలు పట్టకుమీ యిఁకను    // ఉన్న //

వివరణ:

ఇకముందు నేను అనేక పక్కదోవలు పట్టే ముందే నా అధమ స్థితినీ మీ - అంటే నీ యొక్క ఇంకా నీ దేవేరి జగన్మాత యొక్క ఘనతనీ గుర్తుపెట్టుకొని మీ బాధ్యతగా నన్ను రక్షించు. ఓ శ్రీవేంకటేశా! అన్ని విధాలా కూడా నేను నీ దాసులకు దాసుడిని. వారికి దాస్యం చెయ్యడానికి నాకు అడ్డంకులైన నా గత అపరాధాల్ని లెక్కించకు అని ప్రార్థిస్తున్నారు అన్నమయ్య. అన్ని చోట్లా నీవు అని, ఇక్కడ మీరు అనడంలో  జగత్తుకి తల్లిదండ్రులైన లక్ష్మీ నారాయణులిద్దరినీ వేడుకోవడం తెలుస్తోంది. భాగవతోత్తములు కరుణించి తమవాడు అనుకున్న వాడిని వారికి విధేయుడైన స్వామి ఇక రక్షించక తప్పదు కదా!

Click here for a link to audio by Smt Sravani Ganti

No comments:

Post a Comment

Comments are welcome.