Sunday 11 September 2022

Ksheerabdhi Kanyakaku

అన్నమాచార్య కీర్తన:
*క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని*
*నీరజాలయకును నీరాజనం*

గానం: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగం: మధ్యమావతి
రేకు: 1050-1
సంపుటము: 20-295
రేకురాగము: మంగళకౌశిక

పల్లవి:
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం

చరణం1:
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

చరణం2:
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

చరణం3:
పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం

వివరణ:
సులభంగానే పదాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా రాయట్లేదు.

పల్లవి:
ఇందులో క్షీరాబ్ధి కన్యకకు అంటే అంతకు ముందు అమ్మవారు లేదా అనే సందేహం వస్తుంది. భగవంతుడితో పాటు నిత్యమూ ఉండే ఆయన కృప సృష్టి జరిగాక మొదట భృగు మహర్షి కూతురిగా ఆవిర్భవించింది. దేవతలు కష్టాల్లో ఉన్నపుడు వారిని అనుగ్రహించడం కోసం మళ్ళీ క్షీరసముద్రంలో ఆవిర్భవిస్తుంది.
భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా శ్రీః పూర్వముధధేః పునః
దేవ దానవ యత్నేన ప్రసూతామృత మంథనే|
అని శ్రీవిష్ణుపురాణం చెపుతోంది. భాగవతం కూడా ఇదే చెప్పింది.

లక్ష్మి అంటే అర్థం గతంలో నా పోస్టుల్లో చూసాం. ఒక్క ముక్కలో లోకమాత అని అర్థం చెప్పుకోవచ్చు.

చరణం1:
పద్మాలు మార్దవానికి చిహ్నాలు. నేత్రాలని పోల్చినపుడు సర్వాన్నీ దర్శించే సామర్థ్యాన్ని చెపుతాయి.
జలజాక్షి ముఖం కూడా జలజమే!

కుచాల గురించి గతంలో చెప్పాను. అమ్మవారికి అయినా, ఒక మగవాడికైనా, ఒక జడవస్తువుకి అయినా భగవంతుడికి మాత్రమే చెంది ఉండటం అనే లక్షణాన్ని సూచిస్తాయి. భగవంతుడు భర్త!

కొప్పు జ్ఞానానికి ప్రతీక. ఇంక వరద అభయ హస్తాల గురించి చెప్పక్కర్లేదు.

చరణం2:
పాదపద్మాలు (చరణ కిసలయమ్ములు) శ్రీమన్నారాయణుడి శరణ్యత్వానికి చిహ్నాలు.

అమ్మవారు ఆశరణ శరణ్య అయితే భగవంతుడు అనాలోచిత విశేష అశేష లోక శరణ్యుడు (భగవద్ రామానుజులు చెప్పినట్టుగా). శరణు లేని వారికి ఆవిడ శరణం అయితే, ఏమీ ఆలోచించకుండా సమస్త లోకాలకీ ఆయనే శరణు! ఇంక ఇద్దరికీ తేడా ఏమిటి? అందుకే పెద్దలు ఒక ప్రత్యేక దేవతగా కాకుండా మూర్తీభవించిన భగవత్ కృపగా చెపుతారు.

ఊరు అంటే ఆధారం అయినది. రంభ అంటే వెదురు. రంభోరు అంటే వెదురు వంటి బలహీనమైన తొడలు లేదా మోకాలికీ పాదానికీ మధ్య భాగం కలిగినది అని చెప్పవచ్చు. అంటే భగవంతుడే తప్ప వేరే ఆధారం లేనిది ఆయన కృప.

అయ్యవారు కల్పవృక్షం అయితే అమ్మవారు కల్పలత అని శ్రీవిష్ణుపురాణం.

జఘనం అన్నా ఇదే అర్థం వస్తుంది. జఘనం రాగానికి కూడా చిహ్నం. అరిది జఘనం అంటే అరుదైన అంటే ఉందీ లేదా అన్నట్లు ఉన్న నడుము! అమ్మవారికి అయ్యవారిపై ఎంతో రాగం ఉన్నప్పటికీ, అయ్యవారి రాగంతో పోలిస్తే అమ్మవారి ఉండీ లేనట్టుట! అమ్మవారి విషయంలో నహి నిందా న్యాయం. జీవుల విషయంలో సహజం. అందుకే అన్నమయ్య నాయికా భావంలోని శృంగార కీర్తనల్లో కూడా సన్నని నడుముగా చెపుతారు జీవుడికి.

ఇంకా అమ్మవారికి అయ్యవారిపై ఆధార పడటమే తప్పించి ప్రత్యేకంగా అస్తిత్వం లేదు అని నేను చక్కని తల్లికి చాంగుభళా కీర్తనలో రాసిటనట్టు కూడా జఘనం (నడుము) విషయంలో చెప్పవచ్చు. దీనికి స్త్రీ పురుషుల్లో ఎవరు గొప్ప ఇలాంటి అర్థాలు తియ్యకూడదు. భగవంతుడు స్త్రీ పురుషనపుంసక భేదాలకి అతీతుడు.

నాభి అంటే కేంద్రం. భగవదనుగ్రహానికి ఆయన దయే మూలం!

చరణం3:
పట్టపు రాణి అని ఎందుకు అన్నారు అంటే, భగవంతుడికి ప్రపంచంలో ఉన్నవారు అందరూ భార్యలే! అయితే సమస్త విశ్వంలో ఉన్న జీవుల పట్ల ఆయన దయ లేదా శ్రద్ధని శ్రీదేవిగా, భూలోకంలో ఉన్న మన అందరి పట్ల శ్రద్ధని భూదేవిగా, ప్రతి ఒక్క జీవి పట్ల ఉన్న శ్రద్ధని నీళాదేవిగా చెపుతారు. అంచేత శ్రీదేవి పట్టపురాణి!

Click here for an audio visual:




No comments:

Post a Comment

Comments are welcome.