Saturday 24 August 2019

Krishnam Vande Jagadgurum!

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్|

తానే తానే యిందరి గురుఁడు
సానఁబట్టినభోగి జ్ఞానయోగి // పల్లవి //
అపరిమితములైనయజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ధి పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి // తానే //
అన్నిచేఁతలను బ్రహ్మార్పణవిధిఁ జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరంగఁ గరుణించు
పన్నగశయనుఁడే బ్రహ్మయోగి // తానే //
తనరఁగఁ గపిలుఁడై దత్తాత్రేయుఁడై
ఘనమైనమహిమ శ్రీవేంకటరాయఁడై
వొనరఁగ సంసారయోగము గృపసేయు
అనిమిషగతుల నభ్యాసయోగి // తానే //

అన్నమాచార్యుల సంప్రదాయంలో భగవంతుడు శ్రీనివాసుడు ప్రథమ గురువు. జగన్మాత శ్రీదేవి రెండవ గురువు. 

భగవద్గీతా సారాన్ని అన్నమాచార్యులవారు ఇందులో బోధిస్తున్నారు.

పల్లవి:

తానే తానే యిందరి గురుఁడు
సానఁబట్టినభోగి జ్ఞానయోగి 

సంస్కృతంలో యుజ్ అనే ధాతువుని కలిపి ఉంచడం అనే అర్థంలో వాడతారు.  అందరికీ అంతర్యామిగా అందరితోనూ నిత్యం కలసి ఉండే సర్వేశ్వరుడే అందరికీ గురుడు, అందరికన్నా పెద్ద యోగి!

చరణం 1:

అపరిమితములైనయజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ధి పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి 

భోక్తారం యజ్ఞ తపసాం అని భగవద్గీతలో అన్నట్లుగా (5.29) ఆయనే సమస్త యజ్ఞాలకూ తపస్సులకూ భోక్త. "పత్రం పుష్పం ఫలం తోయం" అన్నట్లుగా భక్తులు పత్రం, పుష్పం, ఫలం, జలం ఏది సమర్పించినా ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు (గీత 9.26).  జగత్తునంతటినీ నిరంతరం అనుభవించడంలో నేర్పరి. "వాసుదేవః సర్వమితి"  అన్నట్టుగా వాసుదేవుడే సర్వమని (గీత 7.19) తలచే జ్ఞానులకు నిరంతరము లభించే జ్ఞాన యోగి. 

భోక్తారం యజ్ఞ తపసాం సర్వ లోక మహేశ్వరం 
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి| 

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి 
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః | 

బహూనాం జన్మనామ్ అంతే జ్ఞానవాన్ మామ్ ప్రపద్యతే 
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః | 

చరణం 2:
అన్నిచేఁతలను బ్రహ్మార్పణవిధిఁ జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరంగఁ గరుణించు
పన్నగశయనుఁడే బ్రహ్మయోగి

యజ్ అనే ధాతువు సంస్కృతంలో దేవపూజ అనే అర్థంలో వాడతారు. 
భగవంతుడే సర్వమని తెలిసిన వాడు ప్రపన్నుడు (7.19). అలాంటి ప్రపన్నులు చేసేది జ్ఞాన యజ్ఞం. ఆ విధంగా జ్ఞానం ద్వారా ప్రపన్నులచే అనేక విధాలుగా అర్చించబడే వాడు స్వామి. ఇక్కడ "జ్ఞానయజ్ఞమీగతి మోక్ష సాధనము" అన్న కీర్తన గమనించతగ్గది. 
తపస్సు అంటే భగవంతుడి పాదాలవద్ద అణిగి ఉండటమే. "మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా" (గీత 3.30) అని చెప్పి సర్వకర్మలయందూ మమకారాన్ని త్యజించి వాటిని తనకే విడిచి పెట్టమని చెప్పిన స్వామి కర్మయోగి!
ఇదే విషయాన్ని రామే సంన్యస్త మనసా, తపస్వినీ, అని వాల్మీకి మహర్షి సీతమ్మ వారి గురించి చెప్పగా దాన్ని నమ్మాళ్వార్లు మరింత విశదంగా మన అందరికీ వర్తించేలాగ చెప్పారు. 

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: అని గీతలో (4.24) అన్నట్లుగా చేసేదంతా బ్రహ్మమయంగా భావించే వారు ఆ పరబ్రహ్మాన్నే పొందుతారు (బ్రహ్మైవ తేన గంతవ్యం). వారిని తాను ఏలుకుంటాను అని తెలియజెప్పి, చివరకు కరుణతో  తన పదాన్ని అనుగ్రహించే ఆ యోగనిద్రలో ఉన్న పన్నగశాయి "బ్రహ్మయోగి"! ఇక్కడ యోగనిద్ర జగద్రక్షణ చింతనాన్ని సూచిస్తుంది. 

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః |

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం 
బ్రహ్మైవ  తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా| 

చరణం 3:
భాగవత పురాణంలో కపిల మహర్షి, దత్తాత్రేయుల వారు ఇత్యాదులు భగవంతుడి అంశావతారాలు. తానే స్వయంగా ఈ విధంగా సుప్రసిద్ధులైన యోగులుగా అవతరించి భాగవతధర్మాన్ని వ్యాప్తి చేసాడు స్వామి. అంతకంటే ఘనమైన మహిమ కల పరిపూర్ణావతారమైన శ్రీవేంకటేశ్వరుడిగా శ్రీదేవితో కూడిన తన సంసారయోగాన్ని మనకు శరణ్యంగా  నిరంతరం శ్రీవేంకటాద్రిపై కృప చేయడం అభ్యాసంగా కల యోగి స్వామి! 

Audio link:
https://www.youtube.com/watch?v=fOhkPhqcBcg&feature=share

No comments:

Post a Comment

Comments are welcome.