Thursday 10 October 2019

భగవద్రక్షణ ఆవశ్యకత - Need for Lord's protection of the ignorant and week

ప|| తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద | వెలుగు లోపలికి వెలుగేలా || చ|| అరయ నాపన్నుని కభయ మీవలెగాక | ఇరవైన సుఖి గావనేలా | వఱత బోయెడువానివడి దీయవలె గాక | దరివాని తివియ(గ దానేలా || చ|| ఘనకర్మారంభుని కట్లు విడవలె గాక | యెనసి ముక్తుని గావనేలా | అనయము దుర్బలుని కన్న మిడవలెగాక | తనిసిన వానికి దానేలా || చ|| మితిలేని పాపకర్మికి దావలె గాక | హిత మెరుగు పుణ్యునికి నేలా | ధృతిహీను గృపజూచి తిరువేంకటేశ్వరుడు | తతి గావకుండిన తానేలా ||


పల్లవి:

భగవద్గీతలో శ్రీకృష్ణుడు "తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః| నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీ పేన భాస్వతా|" అంటాడు (గీత 10వ అధ్యాయం 11వ శ్లోకం). దీని భావం తన భక్తుల హృదయాల్లో అంతరాత్మగా ఉండే స్వామి వారిలో అజ్ఞానం వల్ల తనని తెలుసుకొనలేకపోవడం అనే తమస్సుని జ్ఞానమనే దీపంతో పోగొడతారు అని. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు దీపం అనేది చీకటిలో అవసరం కానీ పెద్ద వెలుగులో మరొక వెలుగెందుకు అంటారు. అంటే స్వామి దయ సదా పరమపదంలో ఆయనను సేవించే నిత్యులపై, ముక్తులపై కన్నా, వాసుదేవుడే సర్వమనే మహావిశ్వాసం కల జ్ఞానులపై కన్నా, రక్షిస్తాడో రక్షించడో అనే భయంతో ఉన్న సాధారణ జీవులపైన ప్రసరించి వారిని కూడా తరింపచేయడమే ఎక్కువ అవసరం అని అర్థం.ఇదే పల్లవిలో భావం.

మొదటి చరణం: మొదటి చరణంలో ఆపదలో ఉన్న వారికి స్వామి అభయం అవసరం కానీ సుఖంగా ఉన్నవారికి ఎందుకు అంటారు. ఆపదలో చిక్కుకొన్న గజేంద్రుడు, శ్రీవిభీషణుడు వంటి వారికి అభయం అవసరమే కానీ, సర్వేశ్వరుడే తమ సర్వస్వం అని తెలిసిన హనుమంతుడి వంటి నిర్భయులకి అభయం అవసరం లేదు కదా! అలాగే అన్నమయ్య సంసారమనే వరదలో కొట్టుకు పోతున్న వాడి మార్గాన్ని ఆ కరివరదుడు చక్కదిద్దాలి కానీ, ఒడ్డున ఉన్నవాడికి రక్షణ అవసరం ఏముంది? రెండవ చరణం: భగవద్గీతలొ "అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః" (గీత 18.66) అన్నట్లుగా అనేక కర్మలచేత బంధించబడిన వాడి కర్మ పాశాలని స్వామి విప్పాలి కానీ, వాటినుండి విముక్తుడై స్వామిని పొందినవాడిని ఇంకా రక్షించడానికి ఏమి ఉంది? బలహీనుడికి ఆహారాన్ని ఇవ్వాలి కానీ, తృప్తి చెందినవాడికి ఇంకా ఏమి ఇవ్వాలి? వేదంలో "తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః" అని చెప్పినట్లు ఆ ఆనందనిలయుడి పరమపదం ఎల్లప్పుడూ నిత్యుల చేత, ముక్తుల చేత సేవింపబడుతూనే ఉంటుంది. ఇక్కడ అన్నం తినడం అంటే సర్వేశ్వరుడిని అనుభవించడమే. నమ్మాళ్వారులు తిరువాయ్ మొళిలో "ఉణ్ణుం శోఱు" అనే పాశురంలో చెప్పినట్లుగా (6.7.1) తినే తిండి, త్రాగే నీరు, అ తర్వాత నమిలే తమలపాకులు, భగవదనుభవం కోసం తహతహలాడుతున్న వాడికి సర్వమూ పుండరీకాక్షుడైన కృష్ణుడే. మూడవ చరణం: అంతులేని పాపాలు చేసిన వాడికి ఆయన రక్షణ అవసరం కానీ, తనకి ఏది హితమో తెలిసిన పుణ్యుడికి ఎందుకు? ఇక్కడ పాపాలు అంటే వ్యర్థమైన కార్యకలాపాలు అన్నీ. హితం అంటే ఆత్మని భగవంతుడు ఉద్ధరిస్తాడు అనే విశ్వాసాన్ని కలగజేసేది, ఇది ఆచార్యుల వాక్కు. పుణ్యుడు అంటే భగవదనుగ్రంచేత హితాన్ని తెలుసుకొని ధన్యుడైనవాడు. భగవంతుడు రక్షిస్తాడో రక్షించడో అనే ధైర్యహీనుడిని శ్రీవేంకటేశ్వరుడు కృపతో వీక్షించి రక్షించకపోతే ఇంక ఆయన ఎందుకు? తప్పక రక్షిస్తాడు అని భావం. ఇక్కడ శ్రీదేవి (తిరు) భగవత్కృప.

Audio link :
Courtesy Smt Ganti Sravani :

https://www.youtube.com/watch?v=2VVnjDenpNQ&t=4s

No comments:

Post a Comment

Comments are welcome.